అద్భుతాలేమీ జరగలేదు.. వరుణుడు కూడా కాపాడలేదు.. బ్యాటర్ల వైఫల్యంతో బెంగళూరు టెస్టులో భారత్ కు ఓటమి తప్పలేదు. సొంతగడ్డపై చాలారోజుల తర్వాత భారత్ జట్టుకు ఓటమి ఎదురైంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య భారత్‌ను చిత్తు చేసింది. అద్భుతం చేస్తారని భావించిన భారత స్పిన్నర్లు చేతులెత్తేసారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. చివరిసారిగా 1988లో భారత్ లో న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరిరోజు మొదటి అరగంట మాత్రమే భారత బౌలర్లు కివీస్ ను ఇబ్బంది పెట్టగలిగారు. బూమ్రా ఆరంభంలోనే 2 వికెట్లు తీసినా బంతి పాతబడిన తర్వాత న్యూజిలాండ్ బ్యాటర్లదే పైచేయిగా నిలిచింది. ఈ ఓటమితో మూడు టెస్టుల సిరీస్ లో కివీస్ 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
తొలి టెస్ట్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. ఓవర్‌కాస్ట్ కండీషన్స్‌లో తమను ఇబ్బంది పెట్టారని, 46 రన్స్కే ఆలౌటవుతామని అస్సలు ఊహించలేదన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో తాము చక్కగా ఆడామని గుర్తు చేశాడు. 350 పరుగులు వెనుకబడిన పరిస్థితుల్లో ఇక ఆలోచించేది ఏమీ ఉండదని , పరుగులు చేయాల్సిందేనని వ్యాఖ్యానించాడు.తమ బ్యాటర్లు నెలకొల్పిన కొన్ని పార్టనర్ షిప్స్ తో మ్యాచ్ పై ఆశలు నిలిచాయన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైనా తాము పోరాడిన తీరుపట్ల గర్వపడుతున్నట్టు చెప్పుకొచ్చాడు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్ , పంత్ లపై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. రిషభ్ పంత్ చాలా రిస్కీ షాట్స్ ఆడినా.. తన ఆటలో పరిణతి కనబర్చాడన్నాడు. సర్ఫరాజ్ కూడా గొప్ప పరిణతి చూపించాడని మెచ్చుకున్నాడు. అతను ఆడుతున్నది నాలుగో టెస్ట్ అయినా.. ఎంతో అనుభవం కలిగిన ఆటగాడిగా పరుగులు చేశాడని ప్రశంసించాడు. ముఖ్యంగా ఎలాంటి షాట్స్ ఆడాలనే విషయంలో స్పష్టతతో కనిపించాడని కితాబిచ్చాడు. అప్పడప్పుడు ఇలాంటి ఫలితాలు ఎదురవ్వడం సాధారణమేనని చెప్పిన హిట్ మ్యాన్ సానుకూల దృక్పథంతో రెండో టెస్టుకు రెడీ అవుతామన్నాడు. సిరీస్ ఆరంభంలో ఓటమి తమకు కొత్త కాదన్న రోహిత్ ఇంగ్లాండ్ సిరీస్ ను ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పై తొలి మ్యాచ్ ఓడి తర్వాత వరుసగా 4 టెస్టులు గెలిచామని హుర్తు చేశాడు. ఇప్పుడు న్యూజిలాండ్ పైనా అదే స్ఫూర్తితో రాణించి సిరీస్ గెలుస్తామని రోహిత్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు.