తెలంగాణ రాజకీయం సెగలు కక్కుతోంది. అధికారం నిలబెట్టుకొని హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఎలాగైనా అధికారం దక్కంచుకోవాలని బీజేపీ.. ఇచ్చిన తెలంగాణలో సత్తా చాటాలని కాంగ్రెస్.. పార్టీలన్నీ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయ్. ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌కు వచ్చే ఎన్నికలు కచ్చితంగా సవాల్‌లాంటివే !
రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా జనాల్లో పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద జనాల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది. కేసీఆర్ సర్వేల్లోనూ అదే తేలింది. అలాంటి చోట ఎమ్మెల్యేల తీరు ప్రత్యర్థులకు ఆయుధంగా మారనుంది. ఐతే ఆ చాన్స్ ఇవ్వొద్దని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. సిట్టింగ్‌లందరికీ టికెట్ ఖాయం అని ముందుగా ప్రకటించినా.. ఇప్పుడు ఆ మాటను తీసుకెళ్లి గట్టు మీద పెట్టే అలోచన చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీతో పాటు.. ప్రైవేటు సర్వేలు కూడా చేయించారు కేసీఆర్. అందులో దాదాపు 25మంది ఎమ్మెల్యేలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వారికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోవాల్సిందే అని తేలిందని తెలుస్తోంది. సిట్టింగ్‌ల్లో మరో 20 నుంచి 25మందికి టికెట్ ఇస్తే.. టఫ్ ఫైట్ తప్పదని.. ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని.. కేసీఆర్ దగ్గరకు నివేదికలు వచ్చాయని తెలుస్తోంది.
ఓవరాల్‌గా 40 నుంచి 45మంది సిట్టింగ్‌లకు కేసీఆర్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ సిట్టింగ్‌ల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఆ 45మందిలో తమ పేరు ఉందా అని తెగ కంగారు పడిపోతున్నారు. ఐతే ఒకేసారి 45మందిని పక్కనపెట్టడం అంటే.. పార్టీకి కచ్చితంగా నష్టం చేసే అంశమే.. రెబల్స్‌గా మారే వాళ్లు కొందరయితే.. సైలెంట్‌గా ఉండి పార్టీకి సహకరించకుండా మరికొందరు ఉండే అవకాశం ఉంది. దీంతో ఆ 45మంది త్వరలో పిలిచి.. కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారట. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. న్యాయం చేస్తామని.. ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ పదవులు ఇస్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దానికి వాళ్లంతా కూల్ అవుతారా అంటే.. కష్టమే! గులాబీ పార్టీలో లుకలుకల కోసం బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది. అసంతృప్తిగా ఉన్న నేతలను.. తమ పార్టీలోకి లాగేందుకు వల వేసి రెడీగా ఉంది. 45మంది పక్కనపెట్టినా ఇబ్బందే.. పెట్టకపోయినా ఇబ్బందే.. దీంతో కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.