BRS TENSION : బీఆర్ఎస్ కి నామినేషన్ విత్ డ్రా టెన్షన్…

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచీ బీఆర్ఎస్ (BRS) కి టెన్షన్స్ మొదలయ్యాయి. అంతకుముందు 10యేళ్ళల్లో తాము చేసిన పాపాలే... ఇప్పుడా పార్టీకి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి.

 

 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచీ బీఆర్ఎస్ (BRS) కి టెన్షన్స్ మొదలయ్యాయి. అంతకుముందు 10యేళ్ళల్లో తాము చేసిన పాపాలే… ఇప్పుడా పార్టీకి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు దగ్గర నుంచి… ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ (KCR) ఆలోచన దాకా… అన్నీ రిపీట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). ఇప్పుడు కొత్తగా లోక్ సభ ఎన్నికల ముందు గులాబీ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది.

తెలంగాణాలో 17 లోక్ సభ (Lok Sabha elections) నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు BRS అధినేత కేసీఆర్. వాళ్ళకు బీఫామ్స్ తో పాటు ఎన్నికల ఖర్చులకు ఒక్కొక్కరికి 95 లక్షల డబ్బులు కూడా ఇచ్చిపంపారు. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, సీనియర్ నేతల ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కూడా బస్సు యాత్రతో తెలంగాణను చుట్టేస్తున్నారు.

అంతా బాగానే ఉంది… కానీ గులాబీ బాస్ కేసీఆర్ కి ఎక్కడో తేడా కొడుతోంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కొందరు విత్ డ్రా చేసుకోవచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 29 దాకా ఉంది. చివరి నిమిషం దాకా అభ్యర్థులు గోడ దూకకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి BRS కి ఏర్పడింది. కొందరు లోక్ సభ అభ్యర్థులు నామినేషన్స్ వెనక్కి తీసుకుంటారని కేసీఆర్ కి ఇప్పటికే సమాచారం ఉంది. గుజరాత్ లోని సూరత్ లో అభ్యర్థులు నామినేషన్ విత్ డ్రా చేసుకోవడంతో ఆ లోక్ సభ సీటును బిజెపి అభ్యర్థి ఏకగ్రీవంగా నెగ్గాడు.
తెలంగాణలోనూ గులాబీ పార్టీ క్యాండిడేట్స్ తో నామినేషన్ వెనక్కి తీసుకునేందుకు తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కొన్ని నియోజకవర్గాల్లో ముందు జాగ్రత్తగా డమ్మీ అభ్యర్థులతో నామినేషన్ వేయించారు కెసిఆర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాడే పాము అవుతుందన్న భయతో… BRS అభ్యర్థులపై టిఆర్ఎస్ (TRS) అధిష్టానం నిఘా పెట్టింది. వాళ్ళు నామినేషన్లు విత్ డ్రా చేసుకోకుండా… అడుగడునా నిఘా పెట్టినట్టు సమాచారం.

ఒకవేళ 29నాడు చివరి నిమిషంలో BRS అభ్యర్థులు ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఇక ముఖాముఖి పోటీ జరుగుతుంది. అంటే… బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుంది. అప్పుడు BRS ఓట్లన్నీ ఏదో ఒక పార్టీకి బల్క్ గా పడే అవకాశాలుంటాయి. పార్టీ అధిష్టానం నుంచి ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చిన 95 లక్షల రూపాయల డబ్బులు, ప్రత్యర్థి పార్టీలు ఇచ్చే మనీతో అభ్యర్థులెవరైనా నామినేషన్ వెనక్కి తీసుకుంటే కారు పార్టీ పరువు గోదాట్లో కలిసినట్టే అంటున్నారు.