AP NOMINATIONS: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..

నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 చివరి తేది. ఆ రోజు సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో.. ఏ నియోజకవర్గంలో.. ఎంతమంది బరిలో ఉన్నారో తేలుతుంది. తర్వాత వారికి రూల్స్‌కు అనుగుణంగా పార్టీ గుర్తులు, ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయిస్తారు.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 07:00 PM IST

AP NOMINATIONS: ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. గురువారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. రూల్స్ ప్రకారం గురువారం మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 చివరి తేది.

VICTORY VENKATESH: వియ్యంకులు.. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థికి వెంకటేష్‌కి రిలేషన్‌ ఏంటంటే

ఆ రోజు సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో.. ఏ నియోజకవర్గంలో.. ఎంతమంది బరిలో ఉన్నారో తేలుతుంది. తర్వాత వారికి రూల్స్‌కు అనుగుణంగా పార్టీ గుర్తులు, ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయిస్తారు. మే 11 సాయంత్రం వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలతోపాటు, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానంతోపాటు 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం వరకూ 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు మరో వెయ్యి వరకు నామినేషన్లు రావొచ్చని అంచనా. వీటిపై అధికారులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది నుంచి నామినేష్లు దాఖలయ్యాయి. తెలంగాణలో ఐదు నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా హడావిడి కనిపించడం లేదు. అయితే, ఏపీలో మాత్రం ఎన్నికల సందడి జోరుగా కనిపిస్తోంది.

రెండు రాష్ట్రాల్లోనూ ప్రచార హోరు కనిపిస్తోంది. ఏపీలో జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, షర్మిల వంటి నేతలు తమ పార్టీల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు ప్రచారం సాగిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రచారం చేయబోతున్నారు. కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రచారం చేస్తారు.