Sr. NTR’s birth anniversary : విశ్వవిఖ్యాత కాదు….పరాజిత సార్వభౌమ

ఎవడి జీవిత చరిత్రకైనా వాడి చరమాంకమే శీర్షిక అవుతుంది. అంటే చివరి రోజుల్లో నువ్వెలా బతికావో... నీ గురించి అదే మొదటగా చెప్తారు. నటరత్న విశ్వవిఖ్యాత సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితం కూడా అంతే.

 

 

 

ఎవడి జీవిత చరిత్రకైనా వాడి చరమాంకమే శీర్షిక అవుతుంది. అంటే చివరి రోజుల్లో నువ్వెలా బతికావో… నీ గురించి అదే మొదటగా చెప్తారు. నటరత్న విశ్వవిఖ్యాత సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవితం కూడా అంతే. జన హృదయాలను గెలిచి… కుటుంబ సభ్యుల చేతిలో దారుణంగా ఓడిపోయాడు ఎన్టీఆర్. మరణం తర్వాత కూడా ప్రతి రోజూ ఓడిపోతూనే ఉన్నాడు. దగా పడుతూనే ఉన్నాడు. మీకు వినడానికి ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ ఇది పచ్చి నిజం. ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత కాదు… పరాజిత సార్వభౌముడు. జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన వాడు. అవన్నీ మభ్యపెట్టి మనం వర్దంతులు, జయంతులకు ఆయన్ని ఆహా… ఓహో అంటూ భజన చేస్తూ ఉంటాం..

ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వస్తే చాలు… ఆయన కుటుంబ సభ్యులంతా సమాధి చుట్టూ మూగిపోతారు. చాలా మౌనంగా… దండాలు పెడుతూ.. పుష్పగుచ్చాలు అలంకరిస్తూ.. అన్నగారు ఎంత గొప్పవాడు, తెలుగు జాతికి ఎంత మేలు చేశాడో.. అంటూ చివర్లో స్టేట్మెంట్ ఇచ్చి ఇళ్లకెళ్ళిపోతారు. చివర్ల లక్ష్మి పార్వతి వస్తుంది. చంద్రబాబు నాయుడుని, బాలకృష్ణని, లోకేష్ ని నానా బూతులు తిడుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి పొగుడుతూ… జగన్ ఎన్టీఆర్ అంశాన్నే పుట్టాడని… ఎన్టీఆర్ ఆశయాలని జగనేనని… కొత్త సమీకరణం ఒకటి చెప్పి ఆవిడ నిష్క్రమిస్తారు. ప్రతి ఏటా రెండుసార్లు జరిగే తంతు ఇది. కానీ నిజంగానే ఎన్టీఆర్ జనం గుండెల్లో ఉన్నాడు. ఈ రోజుకి ఆయన అభిమానించే జనం కోట్లలో ఉన్నారు. కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన్ని జనం ఇప్పటికీ గుండెల్లో పెట్టుకుంటున్నారు.

ఎన్టీఆర్ కి జనం మాత్రమే మిగిలారు. రెండో భార్య, కుటుంబ సభ్యులు, మీడియా అధిపతులు, బంధువులు, పార్టీ నేతలు వీళ్లంతా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వాళ్లే. ఇప్పటికీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్న వాళ్లే. ఈరోజుకి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని … రాజకీయం చేస్తూ ముఖ్యమంత్రి పదవి కోసం క్షణ క్షణం ఆరాటపడే మనిషి చంద్రబాబు నాయుడు. 1994 ఆగస్టులో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, లక్ష్మీపార్వతిని ఒక భూతంగా చూపించి…, పదవులు, ఆస్తులు, పరువు, మర్యాదలు కుటుంబ సభ్యులకి ఆశగా చూపి… వాళ్లందర్నీ లొంగ తీసుకొని రాజకీయం చేశాడు చంద్రబాబు. ఆయన చేసిన ద్రోహానికి 1995 జనవరి 18న గుండె ఆగి మరణించాడు ఎన్టీఆర్. అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో నల్ల బట్టలు వేసుకొని ఎన్టీఆర్ జనంలోకి వెళ్లారు. కానీ జనం ఆయన్ని ఆదరించలేదు. అసలు పట్టించుకోలేదు.
లక్ష్మీపార్వతి అనే ఒక మహిళకి శారీరక వాంఛ కోసం లొంగిపోయిన నాయకుడిగా జనం ఆయన చూశారు. అలా చూసే విధంగా పత్రికలు చివరి రోజుల్లో ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని నాశనం చేశాయి. కుటుంబ సభ్యులే కాదు… జనం కూడా పట్టించుకోకపోవడంతో ఆ బాధతోనే ఎన్టీఆర్ మరణించాడు. ఒక మహా నాయకుడు జీవితం అత్యంత దారుణంగా ముగిసింది. దీనికి కారణం కుటుంబ సభ్యులు. జనం కాదు. ఈరోజు అదే కుటుంబ సభ్యులు… నిత్యం ఎన్టీఆర్ పేరు జపిస్తూ వాళ్ల వాళ్ల అవసరాలకి ఆయన బొమ్మను వాడుకుంటున్నారు. ఆరోజు ఎందుకు ఎన్టీఆర్ నీ వెన్నుపోటు పొడిచావని అడిగితే … పార్టీని కాపాడుకోవడానికి, ఆరోజు అలాగా చేయాల్సి వచ్చింది, ఒక చారిత్రక అవసరం అని అర్థం కాని భాషలో వివరిస్తాడు చంద్రబాబు నాయుడు.

ఎన్టీఆర్ బొమ్మ వేసుకొని ఈనాడు సర్కులేషన్ పెంచుకొని, ఆస్తులు కూడబెట్టుకున్న రామోజీరావు కూడా ఎన్టీఆర్ ని కూలదయడం ఒక చారిత్రక అవసరమేనని చెప్తాడు. కుటుంబ సభ్యులు, రెండో భార్య, మిత్రులు, బంధువులు చేతిలో దారుణంగా ఓడిపోయి ఆ బాధతోనే చనిపోయాడు ఎన్టీఆర్. అన్నిటికంటే దారుణం ఏంటంటే… తాను తెచ్చిన ప్రభుత్వం పోయింది. చివరికి తాను స్థాపించిన పార్టీని పోగొట్టుకున్నాడు ఎన్టీఆర్. ఇంతకంటే విషాదాంతం భారతదేశంలో మరి ఏ నాయకుడికి లేదు. ఒక హీరోయిన్ని ఎరగా వేసి, కోట్లల్లో లంచం ఇచ్చి ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని లీగల్ గా లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అనే ఆరోపణ ఉంది. 300కు పైగా చిత్రాల్లో విశ్వవిఖ్యాత సార్వభౌముడిగా వెలిగిన ఎన్టీ రామారావు చివరికి రాజకీయాల్లో తన వాళ్లు చేసిన కుట్రకు బలైపోయాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరూ మాట్లాడరు. ఎవరు ఆయన్ని వెన్నుపోటు పొడిచారో… మళ్ళీ వాళ్లే ఇప్పుడు జనంలో ఎన్టీఆర్ పేరును, బొమ్మను అమ్ముకుంటున్నారు అది విచిత్రం.

ఇక లక్ష్మీపార్వతి.
1989-94 మధ్య అధికారం లేని ఎన్టీ రామారావును కుటుంబం మొత్తం నిర్లక్ష్యం చేసినప్పుడు పక్కన చేరిన లక్ష్మీపార్వతి, 1995 లో అధికారం వచ్చాక ఎన్టీ రామారావు పక్కనే నిలబడి చక్రం తిప్పాలనుకుంది. తన పరిధి దాటి వ్యవహరించింది. ముఖ్యమంత్రిని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్న రామోజీరావు, చంద్రబాబునాయుడుకు ఇది నచ్చలేదు. రెండో భార్య లక్ష్మీపార్వతిని ఒక పద్ధతి ప్రకారం ఒక విలన్ గా చూపిస్తూ… ఎన్టీఆర్ ని పదవి నుంచి పడగొట్టారు. లక్ష్మీపార్వతి ఇంటికే పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ అపరిమితమైన అధికారం ఆవిడని దారి తప్పించింది. ఎన్టీఆర్ చనిపోయాక నిత్యం చంద్రబాబును తిడుతూ, కొన్నాళ్లు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ పంచన చేరింది లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ జీవితాంతం ఏ పార్టీనైతే, ఏ వ్యక్తులనైతే అసహ్యించుకున్నాడో లక్ష్మీపార్వతి వాళ్ళ పంచనే చేరి… ఎన్టీఆర్ కి మరణం తర్వాత మరో వెన్నుపోటు పొడిచింది. చివరికి ఒక చిన్న పదవి కోసం… వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ ఆశయాలు నెరవేరుస్తున్నాడంటూ భజన చేస్తోంది లక్ష్మీపార్వతి.

ఇక ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి. ఎన్టీ రామారావు జీవితాంతం ఏ పార్టీని అయితే వ్యతిరేకించాడో. అదే కాంగ్రెస్ పార్టీలో చేరి పదేళ్ళుగా కేంద్రమంత్రిగా వ్యవహరించి, ఇప్పుడు మళ్లీ బిజెపిలో చేరి ఈరోజుకి ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని రాజకీయం చేస్తోంది ఆవిడ. ఆ రోజు ఎన్టీఆర్ ని పదవి నుంచి దించి ఆయన మరణానికి కారణమైన వారిలో పురందేశ్వరి కూడా ఉంది. పురందేశ్వరి కూడా నిత్యం ఎన్టీఆర్ నామస్మరణ చేస్తూ తండ్రి ఆశయాల కోసం కృషి చేస్తున్నానని చెప్పుకుంటున్నారు.

బాలకృష్ణ… ఎన్టీఆర్ ను అధికారంలో నుంచి కూలదోసినప్పుడు బావ పంచన చేరాడు. తండ్రికి వ్యతిరేకంగా కుట్ర చేశాడు. ఇప్పటికి రెండుసార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా అయ్యాడు. మూడోసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు. కూతుర్ని చంద్రబాబు నాయుడుకి కోడలుగా చేశాడు… అందుకే నోరెత్తి మాట్లాడలేడు. విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ జీవిత చరిత్రను కూడా సినిమాగా సరిగ్గా తీయలేని దద్దమ్మ. ఆ రోజుల్లో నాన్నగారు… అంటూ ఇప్పటికీ తండ్రి పేరు చెప్పుకునే సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో బతికేస్తున్నాడు. ఎన్టీఆర్ బొమ్మ లేకపోతే బాలకృష్ణ అన్నవాడు జీరో. కానీ బాలకృష్ణ చేతిలో కూడా ఎన్టీఆర్ మరణానికి ముందే ఓడిపోయాడు.

లోకేష్.. తనకు తాతగారు పోలికలు వచ్చినయ్ అంటాడు. ఎవడైనా తండ్రి తండ్రి పోలికలు తనకు వచ్చాయని చెప్పుకుంటాడు. తల్లి తండ్రి పోలికలు మనవడికి రావు. ఎన్టీఆర్ గొప్పవాడు గనుక ఎన్టీఆర్ బ్రాండ్ ను వాడుకోవాలి కనుక, తాను ఎన్టీఆర్ కి వారసుడు అని అంటాడు లోకేష్. కానీ ఆరోజు తాత ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టావ్? తాత మరణానికి నువ్వే కారణం అని చంద్రబాబు నాయుడుని లోకేష్ ప్రశ్నించగలడా.?
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా…. దాదాపు చంద్రబాబు దారిలో నడిచిన వాళ్లే. ఆరోజు ఎన్టీఆర్ ను పదవి నుంచి కూలదోసి ఆయన మరణానికి పరోక్షంగా కారణమైన వాళ్లే. ఎన్టీఆర్ సంపాదించిన ఆస్తిని తిని, అనుభవించి చివరికి తండ్రిని అధికారం నుంచి కూలదోసి… కొత్త చరిత్ర సృష్టించారు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు. జూనియర్ ఎన్టీఆర్ ఏం తక్కువ తినలేదు. ముందు తన ఉనికి కోసం చంద్రబాబు, బాలకృష్ణ పంచన చేరాడు. ఆ తర్వాత తనకు సముచిత గౌరవం దొరకట్లేదు అన్న అలకతో ఇప్పుడు వాళ్ళకి దూరమయ్యాడు. ఈయన ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని బతికేసేవాడే.

మనుషుల్ని అవసరాలు… అవకాశాలు అనే రెండు సూత్రాలు మాత్రమే నడిపిస్తాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల విషయంలో ఇది నూటికి నూరు శాతం నిజం. కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవాళ్లు, రెండో భార్య అందరూ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వాళ్లే. ఎన్టీఆర్ ఎంత గొప్పవాడైనా కావచ్చు… తన వృత్తిలో ఎంత ఎత్తుకైనా ఎదుగుండవచ్చు… కానీ జీవితంలో మాత్రం దారుణంగా ఓడిపోయాడు. జనం హృదయాన్ని గెలిచి తన కుటుంబ సభ్యుల చేతిలో మాత్రం పరాధితులయ్యాడు. అందుకే ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత పరాజత సార్వభౌమ. ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికీ గుణపాఠం. మనం సంపాదించిన డబ్బు… ఆస్తి.. మనల్ని వృద్ధాప్యంలో కాపాడలేవనేది ఎన్టీఆర్ నిజం చేసి చూపించాడు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు మనల్ని ఎంత నిర్లక్ష్యం చేస్తారో… అవసరానికి అలా దిగజారి పోతారు ఎన్టీఆర్ జీవితమే ఒక నిదర్శనం. ఎప్పటికీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని, ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఆయన కుటుంబ సభ్యులు నిత్యం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.