జయలలిత హయాంలో తమిళనాడు రాజకీయాల్లో చక్రం తప్పిన చిన్నమ్మ అలియాస్ శశికళ మళ్ళీ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పుడు నా టైమ్ వచ్చింది. ఇక సీఎం స్టాలిన్ కి చుక్కులు చూయిస్తానంటోంది. 2026లో అన్నాడీఎంకేదే అధికారం అంటోంది చిన్నమ్మ.. ఈమధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీ ఘోరంగా దెబ్బతిన్నది. ఒకప్పుడు జయలలిత టైమ్ లో ఓ వెలుగు వెలిగిన పార్టీ పతనం ఇక మొదలైందని టాక్ వస్తోంది. అయితే పార్టీ కనుమరుగు అయ్యే సమస్యే లేదంటున్న శశికళ… 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలిచి అమ్మ పాలన మొదలుపెడతానని ఓ మీటింగ్ లో చెప్పారు.
పన్లో పనిగా AIDMK కి చీఫ్ గా ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కె. పళని స్వామిపైనా మండిపడింది శశికళ. ఆయన ప్రతిపక్ష నేతగా సరిగా పనిచేయట్లేదు. స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు. ఇకపై అపోజిషన్ రోల్ నేను తీసుకుంటా… స్టాలిన్ ని నిలదీస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు శశికళ. ఎవరూ ఆందోళన పడొద్దు… టైమ్ వచ్చింది. తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా మనవైపే ఉంటారు. అన్నా డీఎంకే కథ ముగిసినట్టు అనుకోవద్దని కేడర్ కు భరోసా ఇచ్చారు. పార్టీలో కుల రాజకీయాలు చేయొద్దు… 2017లో జయలలిత కూడా అలాగే చేస్తే… పళని స్వామి సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు.
జయలలిత చనిపోయిన తర్వాత శశికళ పార్టీలోనూ, బయటా ఎన్నో ఇబ్బందులు పడింది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైల్లో గడిపిన శశికళ 2021 జనవరిలో రిలీజ్ అయ్యారు. పన్నీరు సెల్వం, పళని స్వామి కలిసి ఉన్నప్పుడు శశికళ, టీటీవీ దినకరన్ తో పాటు మరికొందరు బంధువులను అన్నాడీఎంకే పదవుల నుంచి తప్పించారు. ఆ తర్వాత పళనిస్వామి పార్టీపై పట్టు సంపాదించారు. శశికళ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు పళనిస్వామియే చెక్ పెడుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా దెబ్బతినడంతో పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చిన్నమ్మ డిసైడ్ అయింది.
తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలు ఉంటే… మొన్నటి ఎన్నికల్లో ఒక్కసీటు కూడా అన్నాడీఎంకేకి రాలేదు. 22 స్థానాల్లో డీఎంకే గెలవగా… మిగిలిన అన్ని సీట్లనూ ఇండియా కూటమి పార్టీలే గెలిచాయి. దాంతో శశికళ మరోసారి తమిళనాడులో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఏ పార్టీని కూడా వరుసగా రెండోసారి గెలిపించే అలవాటు తమిళనాడు ప్రజలకు లేదు. ఈ సెంటిమెంట్ కరెక్ట్ అయితే 2026లో తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం చేసినా ఆశ్చర్యం అక్కర్లేదని అంటున్నారు.