యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్ లో గాయపడటం ఇప్పుడు దర్శకులకు పెద్ద సమస్యగా మారింది. దాదాపు మూడు వారాల పాటు ఎన్టీఆర్ షూటింగ్ కి దూరంగా ఉండటంతో దర్శకులు తమ షూటింగ్ ల విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నారు. దేవర సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్ కు జిమ్ లో చేతికి చిన్న గాయం అయింది. గాయం చిన్నదే అయినా మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పడంతో ఎన్టీఆర్ షూటింగ్ కి దూరంగా ఉంటున్నాడు. దీనితో దర్శకులు కూడా ఎన్టీఆర్ ను ఒత్తిడి చేసే పరిస్థితి లేదనే చెప్పాలి.
ప్రస్తుతం రెండు సినిమాల్లో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ప్రశాంత్ నీల్ సినిమా కాగా మరొకటి హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా. ఈ రెండు సినిమాల్లో ఇప్పటికే దాదాపుగా సగం షూట్ పూర్తైన సినిమా వార్ 2. ఈ సినిమాలో ఇప్పుడు ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రెడీ చేసారు. ఎన్టీఆర్ తో ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేయనున్నారు. దాని కోసం ఒక షిప్ ని కూడా రెడీ చేశారు. ఎన్టీఆర్ ఎంట్రీ భయంకరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు.
చేతికి గాయం కాకపోయి ఉంటే కచ్చితంగా షూట్ ని వారం రోజుల్లో పూర్తి చేసేవారు. కాని అనూహ్యంగా ఎన్టీఆర్ గాయ పడటంతో వార్ 2 షూట్ ఇప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. దీనితో ఈ షూట్ ని వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. కాగా ఎన్టీఆర్ ప్రమాదం విషయానికి వస్తే… ఆయన చేతికి అయిన గాయం, కారు ప్రమాదం అని కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిని ఎన్టీఆర్ టీం ఖండించింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈ గాయమై౦దని ఆయన టీం స్పష్టం చేసింది.