Odisha: హృదయ విదారకమైన సంఘటన.. వందల కిలోమీటర్లు చనిపోయిన భార్యను మోసుకొని వెళ్ళేందుకు సాహసం..!

  • Written By:
  • Updated On - February 13, 2023 / 12:53 PM IST

స్త్రీ మూర్తని కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అని అంటారు. ఏదైనా పని పురమాయిస్తే దాంట్లో నిమఘ్నమై దాసిగా ఉంటుందని అర్థం, మహిళలకు సహజంగా తెలివి కొంచం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏవిషయంలోనైనా సలహా ఇవ్వడంలో మంత్రిగా చూస్తారు. భోజనం పెట్టడంలో తల్లిగా భావిస్తారు. అందంలో లక్ష్మిదేవితో పోలుస్తారు. పడక గదిలో రంభగా చెబుతారు. క్షమించడంలో అయితే భూమాతగా మగువను కీర్తిస్తారు. అదే భూమి మీద ఓ ఆడకూతురి మరణం చాలా హృదయవిదారకంగా మారింది. శాస్త్రాల్లో ఇన్ని చెప్పిన వాళ్లు మృత్యువు పట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. మరణేశు మహామూర్తి అని కీర్తించింటే బహుశా ఈ రోజు ఇలాంటి దురాగతానికి నోచుకునేది కాదేమో. ఇంతకు ఆ మనోవిదారకమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఆమెపేరు ఇదిగురు. ఒరిస్సా ప్రాంతానికి చెందిన నిరుపేద గిరిజన మహిళ. ఈమెకు వైద్యం కోసం వైజాగ్ లోని నీరుకొండ ఆసుపత్రికి తీసుకొచ్చాడు ఆమె భర్త. ట్రీట్మెంట్ అనంతరం ఆటోలో తమ స్వగ్రామం కోరాపుట్టి జిల్లా పొట్టంగి బ్లాక్ కోసాదికి తిరుగుపయనం అయ్యారు. భార్యను ఇంటికి తీసుకెళ్తున్న సందర్భంలో మార్గమధ్యమంలోనే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఒరిస్సాకు తరలించేందుకు భర్త వద్ద డబ్బులు లేవు. దీంతో ఆటోడ్రైవర్ నడిరోడ్డుమీదే వదిలేసి వెళ్లిపోయాడు. ఇక దిక్కు తోచని స్థితిలో పడిపోయాడు ఆమె భర్త. చేసేదేమీ లేక తనదేహాన్ని వాహనంగా చేసుకుని కాళ్లను చక్రాలుగా సంకల్పించి తన భుజాలపై వేసుకొని తమ ఊరికి తీసుకెళ్లేందుకు ప్రయాణమయ్యాడు. ఒకటా రెండా వందలాది కిలోమీటర్ల లక్ష్యం. మరోవైపు భార్యను కోల్పోయిన బాధ. వీటన్నింటినీ తన పంటి క్రింద అణిచిపెట్టుకొని కాలం పెట్టిన పరీక్షలో ప్రసవవేదనకు గురైయ్యాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న విజయనగరం పోలీసులు వెంటనే స్పందించారు. రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు, ఎస్‎‎ఐ కిరణ్ కుమార్ హుటా హుటిన బయలుదేరి శవాన్ని మోసుకుంటూ వెళ్తున్న వ్యక్తి దగ్గరకి చేరుకున్నారు. వివరాలు అడిగి తెలుసుకున్న పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మరణించిన భార్యను ఒరిస్సాకు తరలించేందుకు సహాయపడ్డారు. దేశంలో ఇలాంటి మనసును కలిచివేసే సంఘటనలు తరుచూ వింటూ, చూస్తూ ఉంటాము. చూసిందే తడవుగా మనకెందుకులే అనుకోకుండా ఇలాంటి వారికి మనవంతు తోచిన సహాయం చేసి ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అవుదాం అనే సంకల్పాన్ని తీసుకుంటే ఇలాంటి వాటికి స్వస్తి చెప్పవచ్చు.