టీ ట్వంటీల్లో మనమే తోపు, రికార్డులతో హోరెత్తిన జోహెనస్ బర్గ్

సౌతాఫ్రికా టూర్ లో యువ భారత్ దుమ్మురేపేసింది. సఫారీ టీమ్ ను చీల్చి చెండాడుతూ చివరి టీ ట్వంటీలో విక్టరీ కొట్టింది. మొదట సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో పరుగుల సునామీ సృష్టిస్తే..తర్వాత బౌలర్లు అదరగొట్టేశారు.

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 03:37 PM IST

సౌతాఫ్రికా టూర్ లో యువ భారత్ దుమ్మురేపేసింది. సఫారీ టీమ్ ను చీల్చి చెండాడుతూ చివరి టీ ట్వంటీలో విక్టరీ కొట్టింది. మొదట సంజూ శాంసన్, తిలక్ వర్మ సెంచరీలతో పరుగుల సునామీ సృష్టిస్తే..తర్వాత బౌలర్లు అదరగొట్టేశారు. సౌతాఫ్రికాకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా చెలరేగిపోయాడరు. ఫలితంగా టీమిండియా జోహెనస్ బర్గ్ లో ఘనవిజయాన్ని అందుకుంది. తద్వారా నాలుగు టీ ట్వంటీల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పదుల కొద్ది రికార్డులను భారత్ కొల్లగొట్టింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 23 సిక్సర్లు సాధించి ఆల్‌టైమ్ రికార్డు సాధించింది. టాప్-10 జట్లలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్లుగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, టీమిండియా పేరిట ఉమ్మడిగా ఉండేది. మరోవైపు తిలక్, శాంసన్ వ్యక్తిగత రికార్డులు కూడా నమోదు చేశారు. ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు చేసిన తొలి ప్లేయర్‌గా శాంసన్‌ నిలిచాడు. అతను గత అయిదు మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు బాదాడు. అలాగే టీ20ల్లో వరుసగా రెండు శతకాల సాధించిన అయిదో ప్లేయర్‌గా తిలక్ వర్మ చరిత్రకెక్కాడు.

సెంచరీలతో కదం తొక్కి 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేసిన శాంసన్-తిలక్ వర్మ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అంతర్జాతీయ టీ20ల్లో రెండో వికెట్ లేదా అంతకంటే దిగువ వికెట్లకు ఇదే భారీ భాగస్వామ్యం. కాగా, ఓ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో ఐసీసీ పూర్తి సభ్యదేశాల్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికాతో 31 టీ20లు ఆడిన టీమిండియా 18 సార్లు నెగ్గింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. పరుగుల పరంగా దక్షిణాఫ్రికాకు అతిపెద్ద ఘోర పరాజయం ఇదే. అంతకుముందు ఆసీస్ చేతిలో ఓడిన 111 పరుగుల తేడాతో ఓటమి రికార్డుగా ఉండేది.

పరుగుల పరంగా భారత్‌కు మూడో భారీ విజయం. 2023లో న్యూజిలాండ్‌పై 168 పరుగులు, 2018లో ఐర్లాండ్‌పై 143 పరుగుల విజయం తొలి రెండు ఘన విజయాలు. విదేశాల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు. అలాగే దక్షిణాఫ్రికాలో ఓ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. అంతర్జాతీ టీ20ల్లో ఓవరాల్‌గా ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇటీవల బంగ్లాదేశ్‌పై టీమిండియా సాధించిన 297 రన్స్ టాప్‌లో ఉంది.