Indigo Airlines: ఏసీ లేని విమానం 90 నిమిషాలు గాల్లో ప్రయాణించింది

విమానం అనగానే కొందరికి వింతైన అనుభూతి కలుగుతుంది. మరికొందరికి ప్రయాణం సౌకర్యంతో పాటూ త్వరగా గమ్యస్థానాన్ని చేరేందుకు దోహదపడుతుంది. అందుకే చాలా మంది ఫ్లైట్ జర్నీని ఎంచుకుంటారు. అయితే తాజాగా ఇండిగో విమానాల్లో ప్రయాణం చేస్తున్నవారికి చేదు అనుభవం ఎదురైంది. అదికూడా మూడుచోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తడం కాస్త అసౌకర్యానికి గురిచేసింది.

  • Written By:
  • Updated On - August 6, 2023 / 02:42 PM IST

దేశీయంగా ప్రముఖ పేరొందిన విమానయాన సంస్థ ఇండిగో ఏసీ ఆన్ చేయకముందే గాల్లోకి టేకాఫ్ తీసుకుంది. అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముందుగా తీవ్రమైన ఎండలో సుమారు 10 నుంచి 15 నిమిషాలు క్యూలో నిలుచునేలా చేశారు. తర్వాత ఏసీలు ఆన్ చేయకుండా విమానం బయలుదేరడంతో ప్రయాణీకులకు కాస్త అసౌకర్యం కలిగింది.

ఈ సంఘటనను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తన ఫోన్లో రికార్డ్ చేశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇండిగో యాజమాన్యానికి, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ట్యాగ్ చేశారు. ఇలా జరిగిన సమయంలో దీనిని గురించి ఏ ఒక్క ప్రయాణీకుడు విమాన సిబ్బంది వద్ద ప్రస్తావించలేదు. అందరూ అలాగే అడ్జెస్ట్ అయి ప్రయాణం సాగించారు అని తెలిపారు. మరికొందరైతే వేడికి తట్టుకోలేక చమటలు పట్టినప్పుడు టిష్యూ పేపర్లతో తుడుచుకున్నారు. ఇంకొందరు చల్లగాలికోసం విసురుకున్నారు. ఎయిర్ హోస్టర్స్ టిష్యూలను మాత్రం ఉదారంగా పంచిపెట్టారు అని వ్యంగంగా స్పందించారు. ఏసీ లేకుండా దాదాపు గంటన్నర పాటూ ఫ్లైట్లో కూర్చోబెట్టడం ద్వారా కొందరికి ఊపిరి ఆడనంతపని అయిందని ట్వీట్ చేశారు.

ఈ విమానయాన సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఒకే రోజు ఢిల్లీ నుంచి పాట్నా, ఢిల్లీ నుంచి రాంచీ, చండీగఢ్ నుంచి జైపూర్ కి ప్రయాణిస్తున్న మూడు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తడం, ప్రయాణం నుంచి వెనుదిరగడంతో చాలా మంది తమ పనులకు ఆటంకం కలిగిందని నిరుత్సాహం వ్యక్తపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

T.V.SRIKAR