ఆ ముగ్గురిలో ఒకరు టెస్టుల్లో రోహిత్ వారసుడెవరు ?

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత క్రికెట్ లో పలు చర్చలకు తెరతీసింది. ఈ సిరీస్ ఓటమితో టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైరవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - November 5, 2024 / 02:20 PM IST

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత క్రికెట్ లో పలు చర్చలకు తెరతీసింది. ఈ సిరీస్ ఓటమితో టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైరవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే షార్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేసిన హిట్ మ్యాన్ ప్రస్తుతం టెస్ట్, వన్డే జట్లకు మాత్రమే సారథిగా ఉన్నాడు. తాజాగా సొంతగడ్డపై 0-3 తేడాతో కివీస్ చేతిలో పరాజయం పాలవడంతో రోహిత్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. పైగా కెప్టెన్ గా తాను ఫెయిలయ్యానంటూ రోహిత్ స్వయంగా వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి హిట్ మ్యాన్ వారసుడెవరన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ కు రోహిత్ తర్వాత ముగ్గురు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ శుభమన్ గిల్ తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా పేర్లు వినిపిస్తున్నాయి.

భారత తర్వాతి టెస్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ పేరునే ఎక్కువమంది సూచిస్తున్నారు. పంత్ టెస్ట్ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ కం వికెట్ కీపర్‌గా మంచి రికార్డుతోనే కొనసాగుతున్నాడు. కారు ప్రమాదం నుంచి కోలుకుని రీఎంట్రీలో దుమ్మురేపుతున్న పంత్ ను రోహిత్ వారుసుడిగా అంచనా వేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. పరిస్థితులను వేగంగా అర్థం చేసుకోవడంలో ధోనీ తరహాలోనే పంత్ ఉన్నాడన్నది కొందరు మాజీల అభిప్రాయం. వికెట్ల వెనుక అద్భుతంగా కీపింగ్ చేస్తూ.. బ్యాటింగ్ లో కీలకమైన సమయాల్లో విలువైన ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అదే సమయంలో బౌలర్లకు వికెట్ల వెనుక నుంచి విలువైన సలహాలు ఇవ్వడమే కాదు ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైగా ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం కూడా అతనికి అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.
.
పంత్ తర్వాత రోహిత్ ప్లేస్ ను భర్తీ చేసే సత్తా ఉన్న మరో ఆటగాడిగా శుభ్ మన్ గిల్ పేరు వినిపిస్తోంది. గిల్ నుంచే పంత్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్ ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేస్తుంటాడు. అతని బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్ స్టైల్ కనిపిస్తోంది. ఈ యువ ఓపెనర్ మరో 10 నుంచి 15 ఏళ్ళ భారత్ క్రికెట్ ను ఏలే సత్తా ఉందన్నది మాజీ ఆటగాళ్ళ అంచనా.. గిల్ ఇప్పటివరకు 28 టెస్టు మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో సహా 1709 పరుగులు చేశాడు. గిల్ ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్‌లలో టీమ్‌ఇండియాకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రంజీల్లోనూ అతనికి కెప్టెన్సీ అనుభవం ఉంది.

ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో సారథిగా వ్యవహించిన అనుభవం కూడా ఈ స్టార్ పేసర్ కు ఉంది. ప్రస్తుతం ఆసీస్ టూర్ కోసం ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అతనికే అప్పగించారు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా ఉన్న బూమ్రా .40 టెస్టుల్లో ఆడాడు. సాధారణంగా భారత క్రికెట్ లో బౌలర్లకు కెప్టెన్సీ అవకాశం రావడం అరుదుగా జరుగుతుంటుంది. మొత్తం మీద రోహిత్ వచ్చే ఏడాది టెస్ట్ క్రికెట్ కు కూడా వీడ్కోలు పలికితే ఈ ముగ్గురిలో ఒకరికి కెప్టెన్సీ దక్కే ఛాన్సుంది.