ఆసియా కప్ సూపర్-4లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 49.5 ఓవర్లలో 249 పరుగులకు కుప్పకూలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 121 పరుగులతో సెంచరీతో పోరాడినా ఫలితం దక్కలేదు. గిల్ మినహా మిగతా బ్యాటర్లలో అక్షర్ పటేల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 పరుగులతో ఒక్కడే రాణించాడు.
మిగతా బ్యాటర్లు ఎవరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమిపై నెట్టింట తెగ ట్రోల్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్ చివరి స్థానంలో టోర్నీ ముగించాలనే ప్లాన్‌తోనే టీమిండియా ఈ మ్యాచ్ ఓడిందని కొందరు జోకులు వేస్తున్నారు. బంగ్లా చేతిలో భారత్ ఓడిపోవడంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండు జట్లు సూపర్-4 దశలో ఒక్కో విజయంతో నిలిచాయి. అయితే భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ టీం నెట్ రన్ రేట్ చతికిలపడింది. ఇప్పుడు భారత్‌పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన బంగ్లా.. మూడో స్థానానికి చేరింది. పాక్ చివరి స్థానానికి పడిపోయింది. అలాగే విరాట్ కోహ్లీ, బుమ్రా లేని టీమిండియా ఏమీ చేయలేదని కొందరు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుతిరిగిన రోహిత్ శర్మపై కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది 2012 తర్వాత ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాకు దక్కిన తొలి విజయం కావడం గమనార్హం.