ఫలితం తేలని మ్యాచ్ లో కూడా ఓడిపోవడం ఎలాగో పాకిస్తాన్ జట్టును చూస్తే అందరికీ తెలుస్తుంది…ఖచ్చితంగా డ్రాగా ముగుస్తుందనుకున్న మ్యాచ్ లో మేం ఓడిపోగలం అని నిరూపిస్తూ ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూసింది. అసలు 556 పరుగులు కొట్టి… ప్రత్యర్థి 823 పరుగులు చేసి నాలుగోరోజు చివర్లో రెండో ఇన్నింగ్స్ అవకాశమిస్తే కూడా మ్యాచ్ ను డ్రా చేయలేకపోయారు. ఈ ఓటమితో పాక్ జట్టు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు నమోదు చేయని చెత్త రికార్డ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 550 ప్లస్ రన్స్ చేసినా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి. అంతేకాకుండా ఇరు జట్లు తమ తొలి ఇన్నింగ్స్‌ల్లో 550 ప్లస్ రన్స్ నమోదు చేసిన సందర్భంలో ఫలితం తేలిన రెండో మ్యాచ్ కూడా ఇదే.
ఇంగ్లండ్‌తోనే 2022లో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కాగా ముల్తాన్ టెస్టులో పాక్ బౌలర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచారు. పాక్ బౌలర్లలో ఏకంగా ఆరుగురు 100 ప్లస్ పరుగులు ఇచ్చేశారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లు సెంచరీలతో కదంతొక్కిన బ్యాటింగ్ పిచ్ పై పాక్ రెండో ఇన్నింగ్స్ లో అట్టర్ ఫ్లాపయింది. టాపార్డర్, మిడిలార్డర్ లో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయారు. ఇదిలా ఉంటే స్వదేశంలో పాక్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి.. గత 9 టెస్టుల్లో ఏడింట్లో పాక్ ఓడిపోయింది. అందులో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ కూడా ఉంది. పాకిస్థాన్ బౌలర్లు 150 ఓవర్ల బౌలింగ్ చేయగా… అందులో ఒక్క మెయిడెన్ మాత్రమే ఉంది.
మార్చి 2022 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌కు స్వదేశంలో ఒక్క టెస్టు విజయం లేదు. మొత్తం 11 ఆడగా.. ఏడింట్లో ఓటమి పాలై నాలుగు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. మరోవైపు ఆసియాలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం ఇది రెండోసారి. గతంలో 1976లో భారత్‌ను 25 పరుగుల తేడాతో ఓడించింది. గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. తాజా ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది.