తెలంగాణ కేబినెట్ లో పదవుల పంచాయతీ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో ఇంకా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీగా ఉండగా… అందులో నాలుగు ఇప్పుడు భర్తీ చేసి… రాబోయే రోజుల్లో BRS నుంచి వచ్చే వారికి గానీ పార్టీలో ముఖ్యులకు గానీ మరో రెండు ఖాళీగా ఉంచాలని రేవంత్ రెడ్డి భావించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ముందు… ఎవరికి వారే కొత్త డిమాండ్లు పెడుతుండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం తెలంగాణలో మంత్రి పదవుల కోసం రెండు ఫ్యామిలీలు పంతం పట్టాయి. కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డికి పదవి ఇస్తే తన భార్య పద్మావతికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఉత్తమ్. అయితే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఇవ్వడమేంటని మిగతా కాంగ్రెస్ లీడర్లు అభ్యంతరం చెబుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడే అధికారంలోకి వస్తే… మంత్రి పదవి ఇస్తామని AICC పెద్దలు హామీ ఇచ్చారు. అంతేకాకుండా… భువనగిరి లోక్ సభ స్థానాన్ని గెలిపించాలని కూడా రాజగోపాల్ రెడ్డికి కండీషన్ పెట్టారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ గట్టిగా కష్టపడ్డారు. కిరణ్ 2 లక్షల మెజారిటీతో గెలవడం వెనుక రాజగోపాల్ రెడ్డి కృషి ఉంది. దాంతో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది.
ఈనెల 4న కొత్త మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి భావించారు. ఆ తర్వాత ఆషాఢ మాసం వస్తుండటంతో ఈలోగా మంత్రి పదవులను భర్తీ చేయాలనుకున్నారు. అందుకే తాను ఒక లిస్ట్ పట్టుకొని 5 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం పెట్టారు రేవంత్ రెడ్డి. కేబినెట్ పదవులు, పీసీసీ ఛీఫ్, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంపై అధిష్టానంతో తేల్చేయాలని అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ లిస్టుతో పాటు మల్లు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి… ఇలా ఎవరికి వారే హైకమాండ్ కి తమ లిస్టులు సమర్పించారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న దీపాదాస్ మున్షీతో పాటు కేసీ వేణుగోపాల్ దగ్గర తమ డిమాండ్లు ఉంచారు. ఈ లిస్టులు చూసి అధిష్టానం పెద్దలు అయోమయంలో పడ్డారు.
రేవంత్ కేబినెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు బెర్తులు దక్కాయి.
ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి ఇస్తే మరో కేబినెట్ మినిస్ట్రీ ఆ జిల్లాకే వెళ్తుంది. కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు మంత్రివర్గంలో రెడ్డి డామినేషన్ పెరిగిపోవడంతో మిగతా సామాజిక వర్గాల వారు అభ్యంతరం చెబుతున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డికి కూడా అవకాశం ఇస్తే… ఐదు మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి వెళ్తాయి. మొత్తం 18 మంది మంత్రుల్లో ఐదు పోస్టులు రెడ్డి వర్గానికి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వరకూ బీసీలకు పెద్ద ప్రాధాన్యత లేదు. మైనార్టీలకు అసలు ఛాన్స్ ఇవ్వలేదు.
ముదిరాజ్ లు, ఎస్సీలు, ఎస్టీ వర్గాల నుంచి కూడా మంత్రి పదవుల కోసం డిమాండ్స్ వస్తున్నాయి. సామాజిక వర్గాలు, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఎలా కల్పించాలని రేవంత్ ముప్పతిప్పలు పడుతున్నారు. ఇదే టైమ్ లో ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి మధ్య నడుస్తున్న కేబినెట్ వార్ తో సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ సీనియర్లుగా ఉన్న ఈ ఇద్దరిలో ఏ ఒక్కర్నీ కూడా కాదనలేని పరిస్థితులో ఉంది AICC. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తేనే… ఈనెల 4న మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు.