పంత్ ఔటా…నాటౌటా.. ? డీఆర్ఎస్ పై మళ్ళీ చర్చ

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ మూడోరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కివీస్ ను త్వరగానే ఆలౌట్ చేసిన భారత్ బ్యాటింగ్ లో మాత్రం చేతులెత్తేసింది.

  • Written By:
  • Publish Date - November 3, 2024 / 05:37 PM IST

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ మూడోరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కివీస్ ను త్వరగానే ఆలౌట్ చేసిన భారత్ బ్యాటింగ్ లో మాత్రం చేతులెత్తేసింది. సీనియర్ ఆటగాళ్ళలో ఎవ్వరూ రాణించలేదు. అయితే రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పంత్ ఔటవడం భారత్ ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు. 57 బంతుల్లో 64 పరుగులు చేసిన పంత్ ఔట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అజాజ్ పటేల్ వేసిన బంతిని పంత్ డిఫెన్స్ ఆడగా.. ప్యాడ్ కు తగిలి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ క్యాచ్‌ను అందుకుని ఔట్ అంటూ అప్పీల్ చేయడం ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ప్రకటించడం వరకూ బాగానే ఉంది.

అయితే న్యూజిలాండ్ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ ఎంట్రీ తప్పలేదు. రివ్యూలో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్‌ను ఆధారంగా చేసుకుని పంత్‌ను ఔట్‌గా నిర్ణయించాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ రీడింగ్ చూపించే సమయంలో పంత్ తన బ్యాటును ప్యాడ్‌కు తాకించాడు. దాంతోనే అల్ట్రాఎడ్జ్ అలా చూపిస్తుందని పంత్ మైదానంలో అంపైర్లకు వివరించాడు. మరోవైపు థర్డ్ అంపైర్ బంతి గమనం కాస్త మారిందంటూ ఔట్ ఇచ్చాడు. అయితే అల్ట్రాఎడ్జ్ రీడింగ్ చూపించిన సమయంలో బ్యాటుకు-బంతికి గ్యాప్ ఉందంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. పంత్ నాటౌట్ అని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు జట్టును విజయతీరాలకు చేర్చకుండానే ఔటయ్యాననే బాధతో పంత్ అతికష్టంగా మైదానాన్ని వీడాడు.

కానీ, థర్డ్‌ అంపైర్‌ మాత్రం పంత్‌ను ఔట్‌గానే ప్రకటించాడు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్యాడ్లను తాకినప్పుడే స్పైక్స్‌ వచ్చాయని.. బ్యాట్‌ను తాకలేదనేది భారత క్రికెట్ అభిమానుల అభిప్రాయం. దీంతో డీఆర్ఎస్ పై మళ్ళీ చర్చ మొదలైంది. కొన్ని సందర్భాల్లో డీఆర్ఎస్ ద్వారా తీసుకునే నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. థర్డ్ అంపైర్ నిర్ణయాలు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వస్తోంది. ఇప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ కు ఫేవర్ గా నిర్ణయం చెప్పకుండా థర్డ్ అంపైర్ వ్యవహరిస్తుండడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. పంత్ ఔట్ తో ముంబై టెస్ట్ ఫలితమే మారిపోయిందంటున్నారు.