ఇలాంటి దేశంలో తిండి లేక.. సరైన వైద్యం లేక.. చివరికి సరైన రవాణా సౌకర్యాలు లేక.. చీకట్లో కలిసిపోతున్న బతుకులు ఎన్నో ! ఏడ్చి ఏడ్చి కనీళ్లు అలవాటు చేసుకున్న బతుకులు ఎన్నో ! మారేది ప్రభుత్వాలే బతుకులు కాదు అని భారంగా కాలం వెళ్లదీస్తున్న జీవితాలు ఎన్నో ! ఇలాంటి మనసు మెలేసే ఘటనే జరిగింది ఏపీలో! జోరు వర్షాలు.. చుట్టూ వరదలు.. కనిపించని రోడ్లు. నది ఎలా దాటాలో తెలియదు.. బిడ్డను ఎలా బతికించుకోవాలో అర్థం కాదు.. ఈ పరిస్థితుల మధ్య ఆ తండ్రి పడ్డ వేదన అంతా ఇంతా కాదు. ఆ వర్షం నీటిలో కలిసిపోయి కనిపించలేదు కానీ.. కార్చిన కన్నీళ్ల ఎన్నో!
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిందీ ఘటన. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో.. ఓ గిరిజన కుటుంబం.. ప్రాణాపాయ స్థితిలో నదిని దాటింది. కొమరాడ మండలంలోని నాగావళి నదిపై ఉన్న పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ఆ నది దాటాలంటే.. అక్కడి జనాలు చిన్నపాటి సాహసం చేయాల్సి వస్తోంది. నది అవతల ఉన్న చోళ్లపదం పంచాయితీ రెబ్బ గ్రామానికి చెందిన కొలక మరియమ్మ అనే బాలికకు తీవ్ర జ్వరం వచ్చింది. ఐతే ఆ చిన్నారి ప్రాణాలు కాపాడుకునేందుకు, ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి పడిన కష్టం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రాణాలు పణంగా పెట్టి వెదురు కర్రల తెప్ప సాయంతో.. తండ్రి నది దాటాడు. ఆ తర్వాత కూనేరు మీదుగా రాయగడ ఆసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యం ప్రస్తుతం స్థిమితంగానే ఉన్నా.. ఆ తండ్రి పడిన కష్టం.. ఇప్పుడు వేల ప్రశ్నలు సంధిస్తోంది. ఆకాశాన్ని తాకే బిల్డింగ్‌లు కడతారు.. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని బీరాలు పలుకుతారు. కానీ పేదోడి బతుకుల గురించి ఆలోచించరా.. వాళ్ల కష్టాలు కనిపించవా.. 75 ఏళ్ల భారత్ అని సంబరాలు చేసుకుంటున్నాం.. ఐనా ఓ నది దాటాలంటే ఇంకా యుద్ధమే చేయాల్సి వస్తోంది. దేశం గురించి ఎవరు మాట్లాడినా.. ఇదీ సార్ నా దేశం పరిస్థితి అని బిగ్గరగా చెప్పాలనిపిస్తోంది ఒకసారి అంటూ.. ఈ వీడియో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.