Suryapet Congress: అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లో కనిపించిన అలజడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పటాన్‌చెరు, సూర్యాపేట అయితే.. ఇలాంటి ఆందోళనల వ్యవహారంలో టాప్‌లో నిలిచాయ్. అందుకే చివరి లిస్ట్ వరకు ఈ రెండు స్థానాల విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. పటాన్‌చెరులో ముందుగా నీలం మధుకు టికెట్ కేటాయించింది కాంగ్రెస్. దీంతో ఆ టిక్కెట్ ఆశించిన ఆ పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ తిరుగుబాటు స్వరం వినిపించారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
KTR: చంద్రబాబు, వైఎస్సార్‌పై కేటీఆర్ ప్రశంసలు.. ఆచితూచి మాట్లాడుతున్న కేటీఆర్
దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దిగి వచ్చింది. అభ్యర్థిని మార్చేసింది. నీలం మధును పక్కనపెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో నీలం మధు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఎస్పీ తరఫున పటాన్‌చెరు నుంచి పోటీకి సిద్ధం అయ్యారు. ఇక సూర్యాపేట విషయంలోనూ ఇలాంటి సస్పెన్సే కనిపించింది. రాంరెడ్డి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య.. తీవ్రంగా టికెట్ పోటీ కనిపించింది. ఐతే దామోదర్‌రెడ్డికే టికెట్ కేటాయించింది కాంగ్రెస్. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రమేష్ రెడ్డి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. ఐతే ఎట్టకేలకు.. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డి నామినేషన్ విత్‌డ్రాపై సస్పెన్స్ వీడింది. పటేల్‌ను పోటీ నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. సూర్యాపేట బరి నుంచి తప్పుకునేందుకు పటేల్ రమేష్ రెడ్డి అంగీకరించారు.
కాంగ్రెస్ అధిష్టానం సూచనతో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి.. రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. చర్చల తర్వాత పోటీ నుంచి తప్పుకుంటానని రమేష్ రెడ్డి ప్రకటించారు. కేసీ వేణుగోపాల్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటంతో.. రమేష్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆయనకు అధిష్టానం నల్లగొండ ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోటీ నుంచి తప్పుకునేందుకు అంగీకరించిన పటేల్.. సూర్యాపేటలో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయ్.