ఐపీఎల్ మెగావేలం డేట్స్ ఖరారైనప్పటి నుంచి అభిమానుల ఆతృత అంతకంతకూ పెరిగిపోతోంది. వేలంలో ఎవరికి అత్యధిక ధర వస్తుంది… యువ ఆటగాళ్ళలో ఎవరు జాక్ పాట్ కొడతారన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారిపోయాడు. వేలంలో అతనికి ఎంత ధర వస్తుందన్న దానిపై పలువురు మాజీలు అంచనాలు వేస్తూ హైప్ పెంచేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. స్టార్క్ రికార్డు బద్దలవడం ఖాయమని తేల్చేశాడు. గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో స్టార్క్‌ను కోల్ కత్తా 24.75 కోట్లకు భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్‌లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది. 2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. పంత్ కోసం… ప్రధానంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు మరో రెండు జట్లు పోటీ పడవచ్చని భావిస్తున్నారు. విభేదాలు నెలకొన్న నేపథ్యంలో అతన్ని ఢిల్లీ తిరిగి తీసుకునే పరిస్థితి లేదు. అయితే కెప్టెన్ కావాలనే వ్యూహంతో పంత్‌ను దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ నిర్ణయించుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వేలంలో రిషబ్ పంత్ కోసం నిజమైన పోటీ 20 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ 110.5 కోట్లతో వేలంలోకి వస్తోంది. అలాగే ఆర్సీబీ దగ్గర 83 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర 69 కోట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే పంత్ ధర 25 కోట్ల నుంచి 30 కోట్ల మధ్య పలికే చాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.