Pavan Kalyan on CM KCR : తెలంగాణలో ఉన్న పోరాట స్ఫూర్తి దేశమంతా ఉంటే అవినీతి ఎప్పుడో పారిపోయేది. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధానంగా ఆవిర్భవించిన తెలంగాణ ఏర్పాటై పదేళ్ళయినా ఇప్పటికీ ఇక్కడి యువతకు సరైన న్యాయం జరగలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ-జనసేన అభ్యర్థుల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం మైదానంలో ప్రచార సభలో పాల్గొన్నారు. తెలంగాణలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా…. జ్యాబ్ క్యాలెండర్ వేసి సకాలంలో పూర్తి చేయలేదు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడారని పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతితో కడుపుమండి రోడ్డు మీదకు వచ్చి పోరాడే యువతకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమని పవన్ చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
“తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఆంధ్రలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నా. పదేళ్ళుగా తెలంగాణలో తిరగకపోయినా ఈ ప్రాంతంలో జనసేన పార్టీ ఉందంటే అందుక్కారణం జన సైనికులు, వీరమహిళలే అన్నారు పవన్ కల్యాణ్.
ఘన స్వాగతం పలికి పిలిచినందుకు ధన్యవాదాలు
నీళ్లు… నిధులు.. నియామకాలు నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు పని చేశాయి. 1200 మంది ఆత్మబలిదానాలు చేశారు. వాళ్ళ గౌరవార్ధం గత రెండు సార్లు మేం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలు పిలిస్తేనే రావాలని ఆ రోజు నిర్ణయించుకున్నా. ఇప్పుడు కొత్తగూడెంలో ఇంత ఘన స్వాగతం పలికి పిలిచినందుకు ధన్యవాదాలు చెబుతున్నా అన్నారు పవన్ కల్యాణ్. ఏపీలో తిరిగినట్టే …. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో కూడా పర్యటిస్తాను. సమయాభావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నా అన్నారు జనసేనాని.
తనకు కేటీఆర్, రేవంత్, వీహెచ్ ఇలా అన్ని పార్టీల నేతలతో పరిచయం ఉంది… కేసీఆర్ అంటే గౌరవముంది. కానీ రాజకీయాలు వరకూ నరేంద్ర మోడీకే మద్దతు ఇస్తున్నానన్నారు పవన్ కల్యాణ్.
గద్దరన్నకు మాట ఇస్తున్నా.. యువతకు అండగా ఉంటా
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను చనిపోయే కొద్ది రోజుల ముందు కలిసినట్టు జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పారు. యువత తరఫున నిలబడు, పోరాటం చెయ్, భవిష్యత్తు యువతది.. అని చెప్పారు. కొత్తగూడెం నుంచి గద్దరన్నకు మాట ఇస్తున్నాను…. యువతకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని పవన్ హామీ ఇచ్చారు. యువతకు బంగారు భవిష్యత్తు రావాలన్నా, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు రావాలన్నారు పవన్ కల్యాణ్.
ఎంతసేపూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అభివృద్ధి అన్నట్లుగా పాలన సాగుతుంది తప్ప… ఇల్లందు, కొత్తగూడెం లాంటి ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదన్నారు. హైదరాబాద్ లో ఎకరం రూ.100 కోట్లకు చేరింది. కానీ ప్రతి పల్లె, పట్టణం అభివృద్ధి జరగాలి. యువతకు అవకాశాలు రావాలని, రైతులకు న్యాయం జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులుంటే అసలు కౌలు రైతులు లేరు అన్నట్లుగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కౌలు రైతులను అవమానిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదన్నారు పవన్. రైతులకు న్యాయం జరగాలంటే జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ఆకాక్షించారు పవన్ కల్యాణ్.