PAWAN KALYAN: ఏపీలో పింఛన్ల పంపిణీ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. పింఛన్ల పంపిణీ అంశం.. వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన అన్నట్లుగా సాగుతోంది. వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయద్దని ఈసీ ఆదేశించడంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. సచివాలయ సిబ్బందితో బుధవారం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే, గతంలోలాగా అందరికీ ఇంటిదగ్గరే పింఛన్లు ఇవ్వడం లేదు. దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఇంటి దగ్గర పింఛన్లు ఇస్తుండగా, మిగతావాళ్లు సచివాలయానికి వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. దీంతో సచివాలయానికి వెళ్లడం కొందరికి కష్టంగా మారింది.
AP PENSIONS: ఇది ఎవరి పాపం? ఫించన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి..
ఇదే సమయంలో పింఛన్ల కోసం వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురై ఇద్దరు వృద్ధులు మరణించారు. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనికి కారణం.. టీడీపీయే అని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తన సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్ల దగ్గర డ్యూటీ చేయడానికి సిబ్బంది ఉంటారు కానీ.. పింఛన్లు పంపిణీ చేయడానికి లేరా అని పవన్ ప్రశ్నించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. గతంలో తన సినిమా రిలీజ్ అయినప్పుడు విడుదల చేసిన ఆర్డర్ కాపీని కూడా పవన్ పోస్ట్ చేశారు. ఏపీ చీఫ్ సెక్రెటరీతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. మరోవైపు.. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు సాయంగా ఉండాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.
అవసరమైన వారిని పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళి, పింఛన్ ఇప్పించిన తరవాత తిరిగి ఇంటి దగ్గర దించి రావాలని సూచించారు. కాగా.. ఏపీలో బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమైనా కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రామ సచివాలయాల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంతో పింఛన్లు పంపిణీ కావడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా.. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ అంశం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ… వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా?… pic.twitter.com/5VnX1BuWC4
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2024