Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఇచ్చేసిన పవన్ 

పొత్తులపై తన మనసులో ఏముందో స్పష్టత ఇచ్చేశారు పవన్. ఇప్పటం ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించిన పవన్ సరిగ్గా ఏడాది తర్వాత టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

  • Written By:
  • Updated On - March 15, 2023 / 07:13 AM IST

వైసీపీ ఏదో జరగాలని కోరుకుంటోంది.. కానీ అది జరగదు…. మీరు (ప్రజలు) ఏదో జరగాలని కోరుకుంటున్నారు… అది ఖచ్చితంగా జరుగుతుంది…! పదో ఆవిర్భావ సభలో పొత్తులపై పవన్ ఇచ్చిన క్లారిటీ ఇది. ఈసారి జనసేన బలిపశువు కాదని, ప్రయోగాలు చేసేది లేదంటూ టీడీపీతో పొత్తు గ్యారంటీ అని క్లారిటీ ఇచ్చేసారు జనసేనాని..

వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు తప్పదని మరింత స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు పవన్.. పొత్తు తప్పని పరిస్థితులు నెలకొన్నాయని తేల్చిచెప్పారు. బీజేపీ కలసి రాకపోవడంతోనే ఎదగలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేనాని… రెండు పార్టీలు ఎదిగి ఉంటే టీడీపీతో పొత్తు అన్న ప్రశ్నే ఎక్కడా తలెత్తేది కాదన్నారు. 175సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నేతలు పదేపదే రెచ్చగొడుతున్నారని…. పొత్తు పొడవకూడదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోందని పవన్ అన్నారు. అదే సమయంలో ప్రజలంతా పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారని వారు అనుకున్నదే జరుగుతుందన్నారు. అంటే పొత్తు గ్యారెంటీ అని తేల్చిచెప్పారు. ఈసారి ప్రయోగాలు చేయబోవడం లేదని స్పష్టంగా చెప్పేశారు. అదే సమయంలో తాను సహా నిలబడిన జనసేన అభ్యర్థులంతా గెలిచే విధంగా కార్యాచరణ ఉంటుందన్నారు పవన్. వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం అని చెప్పడం ద్వారా పొత్తులపై స్పష్టత ఇచ్చేశారు పవన్.

పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకు కేవలం 20సీట్లే ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో తెగ హోరెత్తిపోతోంది. కాపు వర్గం నుంచి పవన్ పై 20సీట్లకు ఒప్పుకోవద్దంటూ ఒత్తిడి వస్తోంది. దీనిపైనా క్లారిటీ ఇచ్చారు పవన్. అసలు అలాంటి చర్చలేమీ రాలేదని, తాను దేనికీ ఒప్పుకోలేదని తేల్చేశారు. 20సీట్లు తమకు అంగీకారం కాదంటూ టీడీపీకి కూడా సంకేతాలు పంపేశారు పవన్…

టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ప్రస్తుతం జనసేనతో ఉన్న బీజేపీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు ఆవిర్భావ సభలో క్లారిటీ ఇచ్చేశారు పవన్. బీజేపీ వల్లే ఎదగలేకపోయామని కుండ బద్దలు కొట్టారు జనసేనాని. బీజేపీ పెద్దలు ఓకే అన్నా రాష్ట్ర నాయకత్వం కలసిరాలేదన్నారు పవన్. తాను అనుకున్నట్లు జరిగితే జనసేన, బీజేపీ రెండూ బలపడేవని కానీ అవేమీ జరగలేదని, జరగనివ్వలేదన్న భావం పవన్ మాటల్లో కనపడింది. అసలు తమ మధ్య అంత సయోధ్య ఉండి బలపడి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం అనే పదమే వచ్చి ఉండేది కాదని, అసలు తెలుగుదేశంతో పొత్తు అన్న అంశం వచ్చి ఉండేది కాదన్నారు. అమరావతి విషయంలోనూ ఒకటే రాజధాని అంటూ లాంగ్ మార్చ్ చేద్దామని తాను ప్రతిపాదిస్తే ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఓకే అన్నారని కానీ తాను హస్తిన నుంచి విజయవాడ చేరుకునే సరికి మొత్తం మారిపోయిందని….అదేమీ వద్దని తేల్చేశారన్నారు పవన్. బీజేపీ హైకమాండ్ తనకు అనుకూలంగానే ఉన్నా తప్పంతా రాష్ట్ర నాయకత్వానిదే అన్నట్లు మాట్లాడారు పవన్. ఢిల్లీ పెద్దలపై పొగడ్తలు రాష్ట్ర పెద్దలపై విసుర్లు గుప్పించారు జనసేనాని.

గతంలో బీజేపీని వ్యతిరేకించి తాను ఒంటరిని అయ్యానన్నారు పవన్. అదే సమయంలో రాష్ట్ర ప్రజల కోసం మరోసారి ఒంటరిని అవడానికి సిద్ధమేనన్న వ్యాఖ్యల ద్వారా అవసరమైతే బీజేపీతో తెగదెంపులు చేసుకుంటానని సంకేతాలు ఇచ్చారు జనసేనాని. ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయి బలిపశువును కావడానికి సిద్దంగా లేనని తేల్చేశారు పవన్. తెలంగాణలో పరిణామాలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడా బీజేపీకి ప్రచారం చేయడానికి తాను సిద్దపడ్డానని…. కానీ పోటీ విషయానికి వచ్చే సరికి మీరు ఆంధ్రావాడంటూ కొందరు తనను వెనక్కు నెట్టారన్నారు పవన్. ఆంధ్రావాళ్ల ఓట్లు కావాలి కానీ ఆంధ్రా వాళ్లు పోటీకి అవసరం లేదా అంటూ తెలంగాణ నాయకత్వంపైనా విమర్శలు ఎక్కుపెట్టారు పవన్.

మొత్తంగా చూస్తే పొత్తులపై తన మనసులో ఏముందో స్పష్టత ఇచ్చేశారు పవన్. ఇప్పటం ఆవిర్భావ సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించిన పవన్ సరిగ్గా ఏడాది తర్వాత టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపొడుపులు ఎలా ఉంటాయన్నదే చూడాల్సి ఉంది.

(KK)