Pawan Kalyan: జనసేన – టీడీపీ పొత్తు తరువాత తొలి రాజకీయ యాత్ర.. పవన్ ప్రసంగంపైనే అందరి ఆసక్తి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షెడ్యూల్ పూర్తి చేసుకుని రాజకీయ యాత్ర చేపట్టనున్నారు. ఇది టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత జరిగే మొదటి యాత్ర. ఇందులో పవన్ ప్రసంగం, రాజకీయ అడుగులు ఎలా వేస్తారో అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి. 

  • Written By:
  • Publish Date - October 1, 2023 / 09:49 AM IST

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తరువాత నుంచి రాజకీయ ముఖ చిత్రాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. మన్నటి వరకూ పొత్తు గురించి ఇంకా ఆలోచించలేదన్న పవన్ చంద్రబాబును కలిసిన తరువాత కలిసి పోటీ అన్నారు. దీంతో పొత్తుపై ఒక స్పష్టత వచ్చింది. అయితే సీట్ల కేటాయింపులో ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అప్పటి ప్రెస్ మీట్లో లోకేష్, బాలకృష్ణ సమక్షంలో పవన్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇప్పటి వరకూ ఉమ్మడి భేటీలు ఎక్కడా నిర్వహించలేదు. రాజమండ్రి జైలు వద్ద చేసిన వ్యాఖ్యల తరువాత నేరుగా వారాహి యాత్రతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పవన్ ఏ అంశంపై మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

సినిమా షూటింగ్ పూర్తి చేసి..

గత 20 రోజులుగా పవన్ ఎక్కడా చెప్పుకోదగ్గ సభలు, సమావేశాలు ఏర్పాటు చేయలేదు. కేవలం సినిమా పై దృష్టిని కేంద్రీకరించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటూ.. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ఓజీ సినిమా చిత్రీకరణలో ఫుల్ బిజీ బీజీగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీలైనంత త్వరగా సినిమాలు పూర్తి చేసుకొని రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అటు సినిమా ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ షెడ్యూల్ ను రూపొందించుకున్నారు. కాసేపు వీటికి విరామం ప్రకటించి కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి వారాహి యాత్ర చేపట్టేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వారాహి యాత్ర..

మన్నటి వరకూ ఫుల్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోసారి తన గొంతును ప్రజలకు వినిపించేందుకు సిద్దమయ్యారు. దీనికి అవనిగడ్డను వేదికగా చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తన రాజకీయ ప్రసంగాన్ని వినిపించనున్నారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటించిన 15 రోజుల తరువాత జరుగుతున్న కార్యక్రమం కావడంతో అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. పవన్ ఏం మాట్లాడుతారు. చంద్రబాబు అరెస్టపై ఎలా స్పందిస్తారు. తాజాగా లోకేష్ కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీని ప్రస్తావన ఏమైనా తీసుకువస్తారా అన్నా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇప్పుడు జగన్ పై విమర్శలు, చంద్రబాబు కేసులు కాకుండా ప్రజల పై దృష్టి మళ్లిస్తే ఈ సమయంలో కొంత జనసేనకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.

పవన్ స్టాండ్ ఏంటి..

పవన్ వారాహి యాత్ర చేపడుతున్నారు అన్న విషయం తెలుసుకున్న వెంటనే బాలకృష్ణ దీనికి టీడీపీ మద్దతు ఉంటుంది అని ప్రకటించారు. దీంతో జనసేన కార్యకర్తలకు తోడుగా టీడీపీ శ్రేణులు పాల్గొనాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ తరుణంలో ఏర్పాటు చేసిన సభకు ఎంతమంది ప్రజలు పోగవుతారు.. టీడీపీకి ఇప్పుడు ఎలాంటి మైలేజ్ ఉంది.. ఆ పార్టీలోని నాయకులు ఏమనుకుంటున్నారు.. అని పరీక్షించేందుకు పవన్ కళ్యాణ్ కి మంచి అవకాశం అని చెప్పాలి. అలాగే టీడీపీ కార్యకర్తలను, శ్రేణులను కొంత మందిని తనవైపుకు ఆకర్షించే ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్ కార్యచరణ ప్రకటించినట్లే అవుతుంది అంటున్నారు రాజకీయ పండితులు. పైగా చంద్రబాబు తరువాత ప్రత్యమ్నాయం జనసేన అని నిరూపించుకునే అద్భతుమైన అవకాశం లభించింది. ఇలా చేయడంలో విఫలం అయితే వచ్చిన అవకాశాన్ని కూడా చెయిజార్చుకున్నట్లే అవుతుందని అభిప్రాయ పడుతున్నారు పరిశీలకులు. ప్రస్తుత పరిస్థితుల ద్వారా తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకునేందుకు మంచి సమయం దొరికింది. దీనిని సద్వినియోగం చేసుకొని ప్రజా సమస్యల పై మాట్లాడుతారా.. లేక టీడీపీ నాయకుల్లా, పార్టీ శ్రేణుల్లా మాట్లాడి తన విలువను మరింత తగ్గించుకుంటారా అన్నది వేచి చూడాలి. జనసేన అధినేత ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అన్నది నేటి సభతో తెలిసిపోతుంది.

T.V.SRIKAR