ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే పవన్ కల్యాణ్ తన డ్యూటీ స్టార్ట్ చేశారు. తనకు కేటాయించిన నాలుగు కీలక శాఖలకు సంబంధించి రివ్యూలు చేపట్టారు. అధికారులకు తగిన ఆదేశాలు కూడా ఇస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు ఏకంగా 10 గంటల పాటు వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు పవన్. సమస్యల పరిష్కారానికి టైమ్ బౌండ్ పెట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యంలపై సమీక్షించారు. మూడు నెలల్లో అన్ని సమస్యలకీ పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్. ఎన్నికల ప్రచారంలో చాలా దూకుడుగా కనిపించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్… ఎమ్మెల్యే అయ్యాక చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు.
ఇక శనివారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న తర్వాత… అక్కడ హౌస్ కీపింగ్ సిబ్బంది తమ సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తెచ్చారు. తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమనీ… 8యేళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నట్టు… చాలీ చాలని జీతాలతో బతుకుతున్నామని చెప్పారు. పవన్ సానుకూలంగా స్పందించారు. అసెంబ్లీ సెషన్స్ తర్వాత జనసేన ఆఫీసుకు వచ్చిన పవన్… అక్కడే జనదర్భార్ లో పాల్గొన్నారు. పార్టీ ఆఫీసు బయట ఎండలోనే… ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఓ సామాన్యుడిలాగా కుర్చీ వేసుకొని కూర్చున్నారు. జనం నుంచి వచ్చిన అర్జీలు తీసుకుంటూ… వాళ్ళ సమస్యలను ఓపిగ్గా విన్నారు. బాధలు చెప్పుకోడానికి తన దగ్గరకు ఎప్పుడు వచ్చినా కలుస్తానని గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు పవన్. కొన్ని సమస్యలకు అక్కడిక్కడే పరిష్కారం చూపించారు.
9 నెలల క్రితం తన మైనర్ కుమార్తె అదృశ్యం అయిందనీ… ప్రేమ పేరుతో ట్రాప్ చేశారంటూ భీమవరంకు చెందిన శివకుమారి తన బాధను చెప్పుకుంది. ఆ అమ్మాయి విజయవాడ కమిషనరేట్ పరిధిలో అదృశ్యం అవడంతో… మాచవరం సీఐకు స్వయంగా ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు పవన్ కల్యాణ్. ఆమెను పార్టీ ఆఫీసుకు చెందిన వెహికిల్ లోనే పోలీస్ స్టేషన్ కు పంపించారు. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన బాధితుల గోడు విన్నారు.
గతంలో జనం బాధలు చెప్పుకోడానికి కూడా అవకాశం ఉండేది కాదు… ఇప్పుడు పవన్ కి చెప్పుకున్నామన్న రిలీఫ్ దక్కుతోంది చాలామందికి. అదే టైమ్ లో పవన్ కల్యాణ్ కూడా… పిటిషన్లపై వెంటనే స్పందిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు ఫోన్లు చేస్తుండటంతో బాధితులు సంతోషంగా ఉన్నారు. ఏ ఆర్భాటం లేకుండా పవన్ సామాన్యులతో మాట్లాడుతున్న తీరు చూసి జనసైనికులు, అభిమానులు … ఇది కదా మేం కోరుకున్న ప్రజాస్వామ్యం అంటూ సంతోష పడుతున్నారు.