AP Deputy CM : వారి నుంచి పవన్‌ ప్రాణాలకు ముప్పు.. సేనాని చుట్టూ NSG కమాండోలు..

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా అంటే.. అవును అనే అంటున్నాయ్ కేంద్ర నిఘా వర్గాలు.

 

 

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయా అంటే.. అవును అనే అంటున్నాయ్ కేంద్ర నిఘా వర్గాలు. పవన్‌ను టార్గెట్ చేసుకొని భారీ కుట్ర చేస్తున్నారని.. ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన వచ్చిందని.. దీంతో ప్రతీ నిమిషం జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు సూచించాయ్. పవన్‌ను టార్గెట్ చేసిన గ్రూప్‌లు ఏంటి అనే దానిపై ఇప్పుడే చెప్పలేమని అంటున్నాయ్. తన భద్రతపై పవన్ గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాయి. పవన్ సెక్యూరిటీపై నిఘా సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన వేళ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. NDA కూటమిలో కీలక నేతగా ఉండడం.. ప్రధాని మోదీకి ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతుండటంతో.. పవన్‌ను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయ్. కొంతమంది ఫోన్ కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు. వారి మధ్య పవన్‌కు సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘావర్గాలు అంటున్నాయ్. పవన్ భద్రతపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో… జనసైనికులతో పాటు ఏపీ జనాల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. ఈ మధ్యే వారాహి పూజ కూడా నిర్వహించారు. దీంతో హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్‌ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ మావోయిస్టులు ప్రకటన చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్‌ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఐతే పవన్‌కు NSG సెక్యూరిటీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 18మంది కమాండోలతో భద్రత ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉంది. పవన్‌తో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని హోంశాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.