పాకిస్థాన్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చిన ఆటగాడు ఇమ్రాన్‌ఖాన్. 1992 ప్రపంచకప్‌లో వరుస ఓటములు పలకరించినా.. పట్టు వదలకుండా.. జట్టులోని ఆటగాళ్లలో నిత్యం ధైర్యం నింపుతూ.. కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి ఇమ్రాన్ ఖాన్ నడిపించిన తీరు అద్భుతం. ఆ టోర్నీలో పాక్ ప్రపంచ కప్ గెలుస్తుందని ఆ దేశ అభిమానులు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడంటే క్రికెట్‌లో ‘కింగ్’ హోదా అనుభవిస్తున్న వాళ్లు చాలా మందే ఉన్నారు కానీ.. ఆ తరంలో కింగ్ ఆఫ్ క్రికెట్ అంటే ఇమ్రాన్‌ఖానే. అలాంటి ఇమ్రాన్ ఖాన్‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఘోరంగా అవమానించింది.
పాకిస్థాన్ ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 14)న ఆ దేశాపు క్రికెట్ బోర్డు ఓ వీడియో రిలీజ్ చేసింది. పాక్ క్రికెట్ సాధించిన ఘనతలు చూపించే వీడియో అది. ఆ వీడియోలో దాదాపు అందరు పాక్ లెజండరీ క్రికెటర్లు ఉన్నారు.. ఒక్క ఇమ్రాన్‌ఖాన్ తప్ప. ఇటివలే తోషాఖానా అవినీతి కేసులో దోషిగా తేలి, జైలుకెళ్లిన ఇమ్రాన్‌ఖాన్‌ను విస్మరించింది పాక్ బోర్డు. నిజానికి పాకిస్థాన్ ఇప్పటివరకు సాధించింది ఒక్కటే ఒక్క ప్రపంచ కప్. అది మినహా పాక్ క్రికెట్ సాధించిన విజయాలు ఏమీ లేవు. ఆ టోర్నీ గెలవడం కారణం ఇమ్రాన్‌ఖానేనంటారు ఆ జట్టు ఆటగాళ్లు. తనకున్న ఫ్యాన్ బేస్ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి.. దాన్ని గెలిపించి.. ప్రధాని స్థాయికి ఎదిగిన ఇమ్రాన్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. ఇమ్రాన్‌కి సంబంధించి చాలా మీడియా సంస్థలు వార్తలు టెలిక్యాస్ట్ చేయడం కూడా ఆపేశాయట.
ఆర్మీ చెప్పుచేతల్లో బతికే పాకిస్థాన్‌లో ఎలాంటి సంస్థలకైనా వారు చెప్పిందే వేదం. వాళ్లు చెప్పినా.. చెప్పకున్నా.. ఆర్మీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయరు. పాక్ క్రికెట్ బోర్డు కూడా అందుకే భయపడిందంటున్నారు నెటిజన్లు. అయినా ఇలా చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. నిజమే కదా..! రాజకీయాలు వేరు.. క్రికెట్ వేరు.! క్రికెట్ పరంగా ఇమ్రాన్ ఖాన్ సాధించిన విజయాలు వెలకట్టలేనివి. క్రికెట్ ప్రపంచం గర్వించదగ్గ ఆల్‌రౌండర్లలో ఒకరైనా ఇమ్రాన్‌ని ఇలా వీడియోలో కూడా కనపడనివ్వకుండా చేయడం పట్ల పాక్ క్రికెట్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. పీసీబీ టార్గెట్‌గా ‘#ShameOnPCB’ అని హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.