పెర్త్ భారత్ పాలిట ఎర్త్, ఈ పిచ్ పై విజయం కష్టమేనా ?

ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేసర్ల పండుగ...బౌన్సీ పిచ్ లపై ఆసీస్ పేసర్లు విసిరే బంతులు బుల్లెట్ల కంటే వేగంతో వస్తుంటాయి.. వాటిని కాచుకుంటూ క్రీజులో నిలవడం అంత ఈజీ కాదు.. అందుకే విదేశీ జట్లకు ఇక్కడి పిచ్ లపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కఠిన సవాల్ గానే ఉంటుంది.

  • Written By:
  • Publish Date - November 19, 2024 / 08:23 PM IST

ఆస్ట్రేలియా పిచ్ లు అంటేనే పేసర్ల పండుగ…బౌన్సీ పిచ్ లపై ఆసీస్ పేసర్లు విసిరే బంతులు బుల్లెట్ల కంటే వేగంతో వస్తుంటాయి.. వాటిని కాచుకుంటూ క్రీజులో నిలవడం అంత ఈజీ కాదు.. అందుకే విదేశీ జట్లకు ఇక్కడి పిచ్ లపై బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కఠిన సవాల్ గానే ఉంటుంది. వారి ప్రధాన అస్త్రం కూడా పేస్ ఎటాక్ కు తగ్గట్టు పిచ్ లు రెడీ చేసుకోవడమే… కానీ గత రెండు పర్యాయాలు ఆసీస్ టూర్ లో భారత్ సవాళ్ళకు ఎదురొడ్డి నిలబడింది. వరుసగా రెండుసార్లు కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ సారి కూడా ఎప్పటిలానే పేస్ పిచ్ లే భారత్ కు వెల్ కమ్ చెబుతున్నాయి. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగబోతోంది. గత రెండు పర్యటనల్లోనూ 2-1తో సిరీస్ విజయాలు అందుకున్న టీమిండియాకు ఈసారి దానిని రిపీట్ చేయడం అంత ఈజీ కాదనే చెప్పాలి. పెర్త్ లో తొలి టెస్టుతోనే అసలుసిసలు సవాలు మొదలు కానుంది. పెర్త్ అంటే సాధారణంగా వాకా గ్రౌండ్ గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి మ్యాచ్ ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. గతంలో ఇక్కడ ఒకే ఒక్క టెస్టు మాత్రమే ఇండియా ఆడింది. అయితే ఇక్కడ కూడా బౌన్సీ పిచ్ ఉండనుంది. వాకాలాగే కండిషన్స్ ఉండడం టీమిండియా బ్యాటర్లకు సవాలే.

మరోవైపు గతంలో వాకాలోనూ టీమిండియా నాలుగు టెస్టులు ఆడింది. వాటిలో భారత్ కేవలం ఒక మ్యాచ్ లోనే గెలవగా…. ఆస్ట్రేలియా మూడింట్లో విజయం సాధించింది. 2008లో ఇర్ఫాన్ పఠాన్ ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఇండియా 72 పరుగులతో గెలిచింది. ఇక ఇప్పుడు మ్యాచ్ జరగబోయే ఆప్టస్ స్టేడియంలో ఇండియా 2018లో ఒక మ్యాచ్ ఆడింది. అందులో విరాట్ కోహ్లి సెంచరీ చేసినా.. ఆస్ట్రేలియానే 146 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ సారి భారత్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవకుండా చూడాలని పట్టుదలగా ఉన్న కంగారూలు పిచ్ ల విషయంలో రాజీ పడడం లేదు. పెర్త్ లో భీకరమైన బౌన్స్ పిచ్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ పిచ్ పై మరోసారి టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మరో ఆప్షన్ లేకుండా మొదట బ్యాటింగ్ చేయడమే.. ఎందుకంటే నాలుగో ఇన్నింగ్స్ లో ఇక్కడ బ్యాటింగ్ చేసి నిలబడడం అసాధ్యం.

ఈ పిచ్ పై ఇప్పటి వరకూ జరిగిన అన్ని టెస్టుల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజేతగా నిలిచింది. గత ఏడాది డిసెంబర్ లో ఇదే పిచ్ పై ఆడిన ఆస్ట్రేలియా 360 రన్స్ తేడాతో పాక్ ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో పాక్ కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. పెర్త్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 456 పరుగులుగా ఉంటే… రెండో ఇన్నింగ్స్ లో 250 పరుగులుగా ఉంది. ఇక శుక్రవారం నుంచి ఆరంభం కానున్న భారత్, ఆసీస్ తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు లేవు. పూర్తిగా పేస్ బౌలర్లకు అనుకూలించే పెర్త్ పిచ్ పై భారత బ్యాటర్లు ఎంతవరకూ నిలదొక్కుకుంటారనే దానిపై మన విజయం ఆధారపడి ఉంటుంది.