పెట్రోలు ధరలు పెరగకుండా ఉండేందుకు చక్కని పరిష్కారం చెప్పారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తాను చెప్పినట్లు చేస్తే కొండెక్కి కూర్చున్న ఇంధన ధరలు నేలను తాకాల్సిందే అంటూ వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు. రాజస్థాన్ లోని ప్రతాప్ గఢ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా తన మదిలోని భావనను ప్రజలతో పంచుకున్నారు. భారత్ లో ఏ వాహనం అయినా ఇంటి నుంచి బయటకు రావాలంటే పెట్రోల్ లేదా డీజల్ తప్పని సరి అయిపోయింది. అలా కాకుండా ఇథనాల్, ఎలక్ట్రిసిటీ రెండింటినీ ఉపయోగించడం వల్ల పెట్రోల్ ధరలు అమాంతం పడిపోతాయట. అలాగే రైతులు పాడి చేయడం ద్వారా పశువుల వ్యర్థాలు అందుబాటులోకి వస్తాయి. ఈ వ్యర్థాలలోని ఇథనాల్ ఉపయోగించడం వల్ల పాడి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుందన్నారు.
ఇథనాల్, ఎలక్ట్రిక్ ద్వారా నడిచే వాహనాలకు కేంద్ర ప్రభుత్వం అధికంగా మద్దతు ఇస్తుందని తెలిపారు. వీటితో వాహనాలను నడిపితే భవిష్యత్తులో పెట్రోల్ పై ఉన్న డిమాండ్ అమాంతం పడిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా పెట్రోలు వినయోగం మందగించి ధరలు వాటంతట అవే దిగివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే రానున్న రోజుల్లో లీటరు పెట్రోలు ధర రూ. 15 కే లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో పాటూ రైతులకు లక్షల ఆదాయాన్ని అందించడంలో భాగస్వామ్యం అవుతామని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.