టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఈ మాజీ క్రికెటర్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.ప్రావిడెంట్ ఫండ్ కేసులో అతనిని అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పీఎఫ్ రిజినల్ కమీషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా.. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఉతప్ప సెంచరీస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ని నిర్వహిస్తున్నాడు. అయితే అందులో పనిచేసే సిబ్బంది జీతాల నుంచి పీఎఫ్ సొమ్మును వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కేవలం 23 లక్షల కోసం ఊతప్ప ఈ మోసానికి పాల్పడ్డాడంటూ ఉద్యోగులు వాపోతున్నారు. కాగా డిసెంబర్ 4న ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందన్న విషయం తెలుసుకుని ఉతప్ప తన ఇంటి అడ్రస్ మార్చుకున్నాడు. దీంతో పీఎఫ్ అధికారులు ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి గాలిస్తున్నారు.
ప్రస్తుతం ఊతప్ప దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అతని కుటుంబసభ్యులు కూడా అక్కడే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు డిసెంబర్ 27న అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా పలు విదేశీ టీ ట్వంటీ లీగ్స్ లోనూ, దేశవాళీ లీగ్స్ లోనూ ఊతప్ప పలు జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రాబిన్ ఉతప్ప అంటే మనకు మొదట గుర్తుకొచ్చేది 2007 టి20 ప్రపంచకప్. ఆ టోర్నీలో టీమిండియా ఫైనల్లో పాకిస్థాన్ పై గెలిచి తొలి టి20 వరల్డ్ అందుకుంది. ధోనీ సారధ్యంలో రాబిన్ ఊతప్ప అద్భుత ప్రదర్శనతో హాఫ్ సెంచరీ చేశాడు. ఒకరకంగా ఆ చారిత్రాత్మక విజయంలో ఊతప్ప పాత్ర ఎంతగానో ఉంది. 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఉతప్ప తొలి వన్డే ఆడాడు. అలాగే 2014లో ఐపీఎల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. ఊతప్ప తన కెరీర్లో 46 అంతర్జాతీయ వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఊతప్ప జట్టుకు దూరమయ్యాడు. ఇదిలా ఉండగా ఒక మోసపూరిత కేసులో ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.