AYODHYA RAM MANDIR: మరో రెండు రోజుల్లో అయోధ్యలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాముడిని అమితంగా ఆరాధించే ప్రధాని మోదీ కఠిన దీక్ష చేపట్టారు. ప్రాణ ప్రతిష్ట జరిగే వరకు.. అంటే పదకొండు రోజలుపాటు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే వారం రోజులుగా దీక్ష కొనసాగుతోంది. కఠిన ఉపవాసం కూడా చేస్తూ, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే రోజూ గంట 11 నిముషాల పాటు ఓ ప్రత్యేక మంత్రాన్ని పఠిస్తున్నారు.
AYODHYA RAM MANDIR: శూన్యమాసంలో రాముడి ప్రాణప్రతిష్ట సరైందేనా..? శాస్త్రం ఏం చెబుతోంది..?
మోదీ ఎంతగానో విశ్వసించే కొంత మంది ఆధ్యాత్మిక గురువుల ఉపదేశం మేరకు ఈ మంత్రాన్ని ఆయన రోజూ జపిస్తున్నట్లు తెలుస్తోంది. కఠిన ఉపవాస దీక్ష చేసే సమయంలో ఈ మంత్రాన్ని జపించడం చాలా ముఖ్యమని, అది ఎంతో శక్తిమంతమైనదనీ సమాచారం. జనవరి 12న మోదీ ఈ దీక్ష మొదలు పెట్టారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో మోదీ దీక్ష ముగుస్తుంది. ఈ దీక్షలో మోదీ చాలా నిష్ఠగా ఉంటున్నారు. నేలపైనే నిద్రిస్తున్నారు. కొబ్బరి నీళ్లు తప్ప మరేమీ తీసుకోడం లేదు. రోజూ గోపూజ చేస్తున్నారు. అలాగే అన్నదానం, వస్త్రదానంతోసహా ఇతర దానాలు చేస్తున్నారు. ప్రధాని షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ నిష్ఠను కచ్చితంగా పాటిస్తున్నట్లు మోదీ సన్నిహితులు చెప్పారు.
ఈ దీక్షలో భాగంగానే దేశంలోని పలు ప్రముఖ ఆలయాలను ప్రధాని వరుసగా సందర్శిస్తున్నారు. నాసిక్‌లోని శ్రీ కాలారామ్ ఆలయం, లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయం, గురవాయర్, కేరళలోని శ్రీ రామస్వామి ఆలయంతో పాటు తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాలను మోదీ సందర్శించారు. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసమే తనను దేవుడు పుట్టించి ఉంటాడని మోదీ ఇటీవల భావోద్వేగానికి గురయ్యారు. ఈ అపురూప ఘట్టం కోసం దేశ ప్రజలతో పాటు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదంతా ఆ దైవ సంకల్పమే అని మోదీ అన్నారు.