అందులోని కమ్మని కవితలు ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రేమించిన వ్యక్తిపై ఉన్న భావాలను ఆ ప్యాసింజర్ డైరీలో దింపేశారు. తన ఊసులు, ప్రేమైక్య భావాలు, కల్మషం లేని తన మనసును బొమ్మలు, అక్షరాలుగా మార్చారు. డైరీ మొత్తం ప్రేమ గుబాళింపే. కానీ, ఆ ప్రేమను మోసుకెళ్లుతున్న రైలు ముక్కలైంది. గుండెకు దగ్గరగా పెట్టుకుని ఆ డైరీ గాల్లోకి ఎగిరి శిథిలాలతో కలిసి రైలు పట్టాలపై పడిపోయింది. చుట్టూ విషాద గీతాలు, ఆర్తనాదాలు. తెగిపడిన కాళ్లు, చేతులు. బోగీలను తొలగించి పట్టాలు సరి చేస్తున్న వేళ శిథిలాలను పక్కనేస్తుండగా ఆ డైరీ సిబ్బందికి దొరికింది.
పూవులు, ఏనుగు, చేప బొమ్మలు, అంతా సహజత్వం పెనవేసుకున్న డైరీ పేజీలు కనిపించాయి. బెంగాలీ భాషలో రాసిన ప్రేమ కవితలు అందులో ఉన్నాయి. ‘చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టి కథలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి’ అంటూ రాసిఉన్న కవిత చదివిన వారి గుండెను పిండేస్తుంది. ‘ప్రేమవై నీవు నాకు ఎల్లప్పుడూ కావాలి, నా మనసులో నీవెప్పుడూ ఉంటావు’ అంటూ మరో కవిత ఉంది.
అయితే, ఈ కవితలు రాసిన వ్యక్తి ఆడా, మగా అనేది తెలియదు. ఇప్పటి వరకు ఈ కవిత తన కోసమే రాశారని ముందుకు వచ్చినవారూ లేరు. అసలు.. ఆ కవిత రాసిన వ్యక్తి పరిస్థితి ఏమిటో.. ప్రాణాలతోనైనా ఉన్నారా లేరా కూడా తెలియదు. నేటి టెక్ యుగంలో ప్రేమను ఇంత గాఢంగా.. అదీ డైరీలో రాసుకుని పదిలపరుచుకునే వారు చాలా అరుదు. ఇలాంటి అరుదైన వ్యక్తి తాలూకు డైరీ పట్టాలపై గల్లంతై.. శిథిలంగా కనిపించడం విషాదాన్ని మరింత పెంచింది.