Pravallika Case: ప్రేమలో ఫెయిలై ప్రాణాలు తీసుకున్న ప్రవళిక.. ఆధారాలు బయటపెట్టిన పోలీసులు..

గ్రూప్స్‌ ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన ప్రవళిక అనే యువతి.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో హాస్టల్‌లో ఉరి వేసుకొని చనిపోయింది.

  • Written By:
  • Publish Date - October 14, 2023 / 07:40 PM IST

గ్రూప్స్‌ ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్‌ వచ్చిన ప్రవళిక అనే యువతి.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో హాస్టల్‌లో ఉరి వేసుకొని చనిపోయింది. గ్రూప్‌ 2 వాయిదా పడడంతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని.. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం అంటూ నిరుద్యోగులు భగ్గుమన్నారు. ప్రవళిక మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ వ్యవహరమే అసలు కారణమని తేల్చారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టారు. ఆమె ప్రియుడితో చేసిన చాటింగ్, కాల్ డేటాకు సంబంధించి ఆధారాలు దొరికినట్టు చెప్పుకొచ్చారు. ప్రవళిక కేసు.. తెలంగాణలో రాత్రికి రాత్రి రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటంతోనే తీవ్ర మనస్తాపానికి గురై.. ప్రవళిక ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు రావటంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐతే ప్రవళిక ఆత్మహత్యకు కారణం గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం కాదని.. ప్రేమ వ్యవహారం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్టు చెప్పారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక.. 15 రోజుల క్రితమే గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చి ఆశోక్ నగర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో చేరింది. అంతకు ముందే శివరామ్ రాథోడ్‌ అనే యువకుడిని ప్రవళిక ప్రేమించిందని పోలీసులు వివరించారు. ప్రవళికను శివరామ్‌ మోసం చేసి.. వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్‌ చేసుకున్నాడని.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుందని తేల్చారు.

శివరామ్‌ను ప్రవళిక కలిసిందని.. ఇద్దరూ కలిసి టిఫిన్ కూడా చేశారని.. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా లభించిందని చెప్పారు. శివరామ్‌, ప్రవళిక ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు కూడా తెలుసని వివరించారు. వీళ్లిద్దరికి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్స్ కూడా లభ్యమైనట్టు పోలీసులు బయటపెట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకునే ముందు చివరి కాల్‌ కూడా శివరామ్‌తో మాట్లాడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. గ్రూప్స్‌ కోచింగ్‌ కోసం వచ్చిన ప్రవళిక.. ఒక్క ఎగ్జామ్ కూడా రాయలేదని.. చివరి లేఖలో కూడా తమ అమ్మకు అన్యాయం చేస్తున్నట్టుగానే రాసుకొచ్చిందని.. ఎక్కడా పరీక్షల గురించి ప్రస్తావించలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.