Political Posters: ‘బుక్ మై సీఎం’.. ‘బలి దేవత, ముద్దపప్పు’.. పోస్టర్ల కలకలం

తెలంగాణలో రోజుకో పోస్టర్లతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 01:49 PM IST

హైదరాబాద్ వేదికగా పోస్టర్లు, ఫ్లెక్సీలతో పొలిటికల్ వార్ వేడెక్కింది. రాజకీయ ప్రత్యర్ధులను టార్గెట్ చేసుకునేందుకు పార్టీలు క్రియేటివ్ రాతలతో పోస్టర్లను ప్రింట్ చేయించి రాత్రికి రాత్రి గోడలపై అతికిస్తున్నాయి. తాజాగా మరో పోస్టర్ పై పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ జరుగుతోంది. ‘బుక్ మై షో’ అనేది మూవీ టికెట్స్ ను సేల్ చేసే వెబ్ సైట్. ఆ వెబ్ సైట్ పేరు నమూనాలో ఉండేలా ‘బుక్ మై సీఎం’ పేరుతో సీఎం కేసీఆర్ టార్గెట్ గా పోస్టర్లను హైదరాబాద్ లో పలుచోట్ల అంటించారు. ‘బుక్ మై సీఎం’ పోస్టర్లపై ‘‘డీల్స్ అవైలబుల్.. 30 శాతం కమీషన్’’ అని రాశారు. ఈ పోస్టర్ల వ్యవహారంపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారుపై బురదజల్లే ప్రయత్నాలను ఖండించారు. కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా ఈ పోస్టర్లను అతికించాయని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నేరుగా ప్రశ్నించే దమ్ములేక ఇలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అవినీతికి తావులేని సంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడం సరికాదని కారు పార్టీ నేతలు హితవు పలుకుతున్నారు.

కాంగ్రెస్ పై ఇవాళ మరోసారి పోస్టర్లు..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు టార్గెట్ గా శనివారం హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని విమర్శిస్తూ, ఆరోపణలు గుప్పిస్తూ ఈ పోస్టర్లలోనూ అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు పలు స్కాంలలో ఉన్నారని వాటిలో ప్రస్తావించారు. తాజాగా ఆదివారం కూడా పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. హస్తం పార్టీ దళితులను దగా చేసిందని ఆ ఫ్లెక్సీలలో రాతలు రాశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎస్సీ విభజనపై దళితులను మోసం చేసిందని ఆరోపించారు.ఇప్పుడు కొత్తగా ఎస్సీ డిక్లరేషన్‌తో దళితులను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోందని ఫ్లెక్సీలలో పేర్కొన్నారు. ఇవాళ హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఏర్పాటైన పోస్టర్లు కూడా కలకలం రేపాయి. సోనియాగాంధీ, రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ఫోటోలతో కూడిన ఈ పోస్టర్లలో.. సోనియాగాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అని కామెంట్ చేశారు. సోనియా, రాహుల్ లకు రేవంత్‌రెడ్డి స్వాగతం పలుకుతున్నట్లుగా ఇందులో ఫొటోలను ముద్రించారు.

పోస్టర్ల వెనుక ఎవరు ?

ప్రస్తుతానికి ఇలాంటి పోస్టర్లతో కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే టార్గెట్ గా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఉండొచ్చనే దానిపై క్లూ దొరికిందని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. అవినీతి కోణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లను నిత్యం విమర్శించే ఒక రాజకీయ పార్టీయే ఈ పోస్టర్లను అతికించి ఉంటుందని అంటున్నాయి. పిరికిపందల్లాగా పోస్టర్లు అంటించకుండా.. నేరుగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు. రానున్న రోజుల్లో ఈ పోస్టర్ల వార్ మరింత ముదిరినా ఆశ్చర్యం లేదు. ఇతర పార్టీలు కూడా ఈ పోస్టర్ల వార్ లోకి దూకే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విమర్శలు హద్దు దాటకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.