AP Politics: ఉత్తరాంధ్రలో మారుతున్న పొలిటికల్ సీన్ !?

ఏపీ రాజకీయాల్లో.. ఉత్తరాంధ్ర రాజకీయాలు పూర్తి డిఫరెంట్ అని అంటుంటారు. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీదే పైచేయి. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ హవాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది.

  • Written By:
  • Publish Date - August 13, 2023 / 07:42 AM IST

ఏపీ రాజకీయాల్లో.. ఉత్తరాంధ్ర రాజకీయాలు పూర్తి డిఫరెంట్ అని అంటుంటారు. ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీదే పైచేయి. గత ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ హవాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది. ఇప్పుడు మళ్లీ తన కంచుకోటను కైవసం చేసుకోవాలనే కృత నిశ్చయంతో చంద్రబాబు సేన పావులు కదుపుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జగన్ ప్రభుత్వంపై ఇక్కడి నుంచే తన పోరాటాన్ని ప్రారంభించి.. ఉత్తరాంధ్ర తనకు ఎంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు. పెద్దగా క్యాడర్ లేని బీజేపీకి కూడా ఉత్తరాంధ్రే కీలకం. ఎందుకంటే గతంలో విశాఖ ఎంపీ సీటును గెల్చుకున్న హిస్టరీ కమలం పార్టీకి ఉంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలపై మంచి పట్టు, ఉత్తరాంధ్రలోని కొన్ని సామాజిక వర్గాల అండ ఉన్నందున పురంధేశ్వరికి ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీజేపీ కట్టబెట్టింది. సీఎం వైఎస్ జగన్ కూడా అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ద్వారా విశాఖ కేంద్రంగా ఉత్త‌రాంధ్ర పాలిటిక్స్ పై పట్టును కొనసాగించాలనే వ్యూహంతో వైఎస్సార్ సీపీ అధినేత ఉన్నారు. ఇలా అన్ని పార్టీలు ఉత్తరాంధ్రపై పట్టుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ముందంజలో చంద్రబాబు..

ఏడాదిన్న‌ర క్రితమే విజ‌య‌సాయిరెడ్డి నుంచి వైవీ సుబ్బారెడ్డి ఉత్త‌రాంధ్ర వైఎస్సార్ సీపీ బాధ్య‌త‌లను తీసుకున్నారు. పార్టీని చక్కదిద్దేటందుకు సుబ్బారెడ్డి కసరత్తు చేసినా.. ఇటీవ‌ల ఉత్తరాంధ్రలో జరిగిన స్థానిక‌, ఉపాధ్యాయ ఎన్నిక‌ల ఎమ్మెల్సీ ఫ‌లితాల్లో వైఎస్ జగన్ ఫ్యాన్ గుర్తుకు ఎదురుగాలి వీచింది. ఈ పరిణామం ఆ పార్టీకి ప్రతికూల పవనాలు మొదలయ్యాయనే రెడ్ సిగ్నల్స్ ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తమకు ప్లస్ పాయింట్లుగా మార్చుకోవడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈవిషయంలో రాజకీయ ఉద్దండుడు చంద్రబాబు ముందంజలో ఉన్నారు. ఆయన “యుద్ధభేరి” పేరిట టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరోవైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా పర్యటన ప్రారంభించారు. ఉత్తరాంధ్ర జనం నాడిలో వచ్చిన మార్పును అర్ధం చేసుకున్న సీఎం వైఎస్ జగన్.. ఈ అక్టోబరులో విశాఖపట్నానికి మకాం మారుస్తానని ప్రకటించారు.

వాటిపై మౌనం.. పవన్‌, జగన్ లకు మైనస్

చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లలో ఇప్పటికిప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలను ఆలోచింపజేసే ప్రచారాస్త్రం, సబ్జెక్టు .. చంద్రబాబు దగ్గర మాత్రమే కనిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, వంశధార నిర్వాసితుల సమస్యలు, వంశధార-నాగావళి అనుసంధానం, ఉద్దానంలోని కిడ్నీ వ్యాధి బాధితుల వేదన వంటి అంశాలను చంద్రబాబు లేవనెత్తుతున్నారు. ప్రధాని మోడీతో టచ్ లో ఉంటున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, వైఎస్ జగన్ .. ఉత్తరాంధ్ర అభివృద్ధితో ముడిపడిన పలు కీలక విషయాలపై నోరు విప్పడం లేదు. దీంతో వారు ఈ ప్రాంత జనంలోకి వేగంగా చొచ్చుకుపోలేని పరిస్థితి నెలకొంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యవహారం గురించి కానీ.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుపై కానీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకపడ్డ ప్రాంతాలకు ప్రత్యేక నిధులపై పవన్, జగన్ మాట్లాడలేని పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడలేకపోవడం ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ, జనసేనలకు పెద్ద మైనస్ గా మారుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. బీజేపీ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండబోతోందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.