Elections Holiday: తెలంగాణ అసెంబ్లీకి నవంబర్ 30న ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రోజు ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. పోలింగ్ డే నాడు తెలంగాణలోని అన్ని ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఆదేశాలిచ్చారు. ఉద్యోగులు ఓట్లు వేసేందుకు వీలుగా కంపెనీలు తప్పనిసరిగా హాలిడే ప్రకటించాలని CEO ఆదేశించారు. సెలవు ఇవ్వని సంస్థలు, కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గతంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా చాలా ఐటీ, ప్రైవేట్ కంపెనీలు సెలవు ఇవ్వలేదని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వచ్చాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల రోజున చాలా సంస్థలు లీవ్స్ ఇవ్వలేదు. అందుకే ఈసారి నవంబర్ 30న పోలింగ్ డే నాడు అన్ని సంస్థలు హాలిడే ఇస్తున్నాయో లేదో పరిశీలించాలనీ… సెలవు ఇవ్వని కంపెనీ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.
విద్యాసంస్థలకు రెండ్రోజులు హాలిడేస్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నవంబరు 29, 30 తేదీల్లో స్కూళ్ళకు (school holidays) ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. చాలా విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నవంబరు 29న ఆ సెంటర్లకు ఎన్నికల సామగ్రిని తరలిస్తారు. అందువల్ల విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1న మళ్లీ స్కూళ్లు, కాలేజీలూ తెరుచుకుంటాయి.