Chandrayaan 3: చంద్రుడి దక్షిణ దృవంపై సూర్యకాంతి.. ప్రగ్యాన్‌ మళ్లీ పని చేస్తుందా ?

చంద్రుడి దక్షిన ధృవంపై స్లీప్ మోడ్ లో ఉన్న ప్రగ్యాన్, విక్రమ్ లు తిరిగి పనిచేస్తాయా లేదా అంటే మరో రెండు రోజులు వేచి చూడాలి.

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 01:02 PM IST

మూన్‌ మిషన్‌లో భారత్ పేరును అగ్రస్థాయిలో నిలిపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ ప్రస్తుతం స్లీప్‌ మోడ్‌లో ఉంది. చంద్రుడి దక్షిణ దృవం పైకి చీకటి రావడంతో రోవర్‌, ల్యాండర్‌ను స్లీప్‌ మోడ్‌లోకి పంపారు శాస్త్రవేత్తలు. 14 రోజుల పాటు సేకరించిన డేటాను సేవ్‌ చేశారు. నిజానికి ఈ 14 రోజులు పని చేయడం మాత్రమే ప్రగ్యాన్‌, విక్రమ్‌ టార్గెట్‌. సూర్యుడి వెలుగు నుంచి సోలార్‌ పవర్‌ క్రియేట్‌ చేసుకుని ఈ రెండు పని చేస్తాయి. చంద్రుడి దక్షిణ దృవం మీద పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడ 14 రోజులు ఎండ ఉంటే 14 రోజులు చీకటి ఉంటుంది. చీకటిలో సోలార్‌ పవర్‌ పని చేయదు కాబట్టి ప్రస్తుతం రోవర్‌ ల్యాండర్‌ను స్లీప్‌ మోడ్‌లో ఉంచారు. కానీ మరో రెండు రోజుల్లో చంద్రుడి దక్షిణ దృవంపైకి వెలుతురు రాబోతుంది. ఆ వెలుతురు ప్రగ్యాన్‌, విక్రమ్‌ మీద పడితే మళ్లీ అవి తిరిగి పని చేస్తాయా లేదా అనేది ఇప్పుడున్న మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌.

ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలు ఇదే టాస్క్‌ మీద పని చేస్తున్నారు. ప్రగ్యాన్‌, విక్రమ్‌ను తిరిగి లేపేందుకు ఉన్న అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. వెలుతురు వచ్చిన తరువాత ప్రగ్యాన్‌ తిరిగి పని చేస్తుంది అనేది అందరి నమ్మకం. కానీ ఇక్కడ ప్రగ్యాన్‌ మాత్రమే పని చేస్తే సరిపోదు. విక్రమ్‌ ల్యాండర్‌ కూడా పని చేయాలి. ఎందుకంటే ప్రగ్యాన్‌ తాను సేకరించిన సమాచారాన్ని నేరుగా ఇస్రో కేంద్రానికి పంపదు. విక్రమ్‌ ల్యాండర్‌కు పంపుతుంది. విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి సమాచారం ఇస్రో సెంటర్‌కు వస్తుంది. ఇప్పుడు ప్రగ్యాన్‌ మళ్లీ నిద్ర లేచి పరిశోధనలు ప్రారంభించినా ఆ సమాచారం భూమికి చేరాలంటే విక్రమ్‌ కూడా ఉండాల్సిందే. దీంతో రెండిని తిరిగి మళ్లీ పనిచేసేలా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు సైంటిస్టులు. రెండు రోజుల్లో చంద్రుడి దక్షిణదృవంపైకి ఎండ రాగానే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.