ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్ ఇది. కన్నడ తెలుగు సినీ జనాలకు పూనకాలు తెప్పించే న్యూస్ ఇది… ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇక కళ్ళల్లో ఒత్తులు వేసుకుని సినిమా గురించి వచ్చే న్యూస్ కోసం చూసే న్యూస్ ఇది. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా మొదలైందనే న్యూస్. దాదాపు మూడేళ్ళ నుంచి ఈ సినిమా ఎప్పుడు రా అని ఎదురు చూసే ఫ్యాన్స్ కు ఆ రోజు రానే వచ్చేసింది. సినిమా ఏ ఇబ్బందులు లేకుండా సెట్స్ పైకి వెళ్ళిపోయింది.
మొదటి షెడ్యూల్ మొదలైందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది. ఎన్టీఆర్ 31 వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు గాని సినిమా షూటింగ్ అయితే మొదలైపోయింది. దీనికి సంబంధించిన వీడియో ని చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్టీఆర్… ఈ సినిమా ఓపెనింగ్ షాట్ కి తన కుటుంబ సభ్యులు అందరిని తీసుకొచ్చాడు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బశ్రూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షినాది భాషలతో పాటుగా ఇంగ్లిష్ లో కూడా సినిమా విడుదల కానుంది. ఇప్పుడు ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి జోష్ ఇచ్చింది. సాధారణంగా కేజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు జనాలు ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. అలాంటి తరుణంలో ఈ వార్త రావడం మాత్రం ఫ్యాన్స్ ని ఊపేస్తుంది అనే చెప్పాలి.