6G Network In India: ఇండియాలో అందుబాటులోకి రానున్న 6జీ సేవలు..! ప్రధాని మాటల్లో వాస్తవం ఎంత..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ పంద్రా ఆగస్ట్ వేడుకల్లో భాగంగా ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. తదనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ త్వరలో మన దేశం మరింత సాంకేతికంగా అడుగులు వేయబోతుంది అని తెలిపారు.

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 04:36 PM IST

77 ఏళ్ల భారత స్వాతంత్య్రంలో ఎంత ముందు సాగినా ప్రపంచ దేశాలతో పోటీ పడితే కాస్త వెనుకబడి ఉన్నామని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా మన దేశం అభివృద్ధి చెందుతోంది అని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పటికే 5జీ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఎన్నో వండర్స్ క్రియేట్ చేశామన్నారు. రానున్న రోజుల్లో 6జీ ని భారత్ లో ప్రవేశపెట్టేందుకు 6జీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత తక్కువ ధరలకే 5జీ డేటా ప్లాన్లను మన దేశంలోని వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ 5జీ నెట్వర్క్ కి 6 జీ నెట్వర్క్ కి ఉన్న తేడా ఎంత.. ఎంత వేగంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

5జీ కంటే 6జీ వెయ్యి రెట్లు అధిక వేగం

గతంలో 4జీ నెట్వర్క్ అంటేనే అబ్బా అని ఆశ్చర్యపోయారు ప్రజలు. తాజాగా 5జీ అందుబాటులోకి వచ్చింది. అయితే అన్ని నెట్వర్క్ సంస్థలు పూర్తి స్థాయి 5జీ టెక్నాలజీగా రూపాంతరం చెందలేదు. మన దేశంలో ఇప్పటి వరకూ 700 జిల్లాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో 6 జీ అందుబాటులోకి వస్తే ఇప్పుడు ఉన్న దానికంటే వెయ్యి రెట్టు వేగంతో పనిచేస్తుంది. తాజాగా కేంద్ర టెలికాం సంస్థ డాట్ 6జీ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. దీనిప్రకారం 5జీ నెట్ వర్క్ వేగం సెకనుకు 10 గిగాబైట్స్ ఉంటే.. 6జీ నెట్వర్క్ వేగం వన్ టెరాబైట్ పర్ సెకన్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ బ్రాండ్ల విషయానికి వస్తే 5 జీ అందించే ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్ నుంచి 66 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ తరంగాలను వినియోగిస్తారు. ఇలా చేయడం వల్ల డేటా ట్రాన్స్ఫర్ అతి త్వరగా జరుగుతుంది. అదే 6జీ స్పెక్ట్రమ్ వేవ్ లు 30 గిగా హెడ్జ్ నుంచి 300 టెరాహెడ్జ్ ల వరకూ ఉపయోగించేందుకు దోహదపడుతుంది.

5జీ తో పోలిస్తే 6జీ ఇలా ఉపయోగపడుతుంది

నేటి యుగంలో ప్రతి ఒక్కరూ డేటాని విరివిగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మొదలు మోటారు వాహనాల వరకూ అన్నింటా 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. దీని స్థానంలోకి 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే.. ప్రస్తుత సమాజానికి డిజిటల్ యుగానికి మధ్య ఉన్న దూరం తొలిగిపోతుంది. అలాగే సామాన్యునికి సాంకేతికత మరింత చేరువవుతుందంటున్నారు సాంకేతిక నిపుణులు. అప్లోడింగ్, డౌన్లోడింగ్ వేగం పెరిగి తక్కువ సమయంలో అవసరమైన సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చు. 6జీ నెట్వర్క్ ను ఉపయోగించి నిమిషంలో 100కు పైగా సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎంత దూరంలో ఉన్న డేటా బేస్డ్ ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపరేట్ చేయవచ్చు. అపరిమిత డివైజ్ లకు కనెక్ట్ చేసి డేటా వేగంలో లోపం లేకుండా చూడవచ్చు.

6జీ సేవలు మనదేశంలో

6జీ సేవలను వీలైనంత వేగంగా తమ దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో చైనా, ఫిన్లాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా ముందు వరుసలో ఉన్నాయి. శాంసంగ్, ఎల్జీ, హువావే లాంటి ప్రముఖ సంస్థలు 6జీ సేవలపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ దేశాలు ఎప్పుడు అందుబాటులోకి తెస్తే మనదేశం కూడా వీళ్లతో పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. పలువురు సాంకేతిక నిపుణుల అంచనా ప్రకారం 2028-30 మధ్య 6జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

T.V.SRIKAR