జూబ్లిహిల్స్‌లో దొరికిన రెండు రాతి గొడ్డళ్లు.. 6వేల ఏళ్ల కిందటే ఆదిమానవులు ఇక్కడ జీవించినట్లు చెప్తున్నాయ్. జూబ్లిహిల్స్‌కు అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరు ఉంది. సినిమా, రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు అంతా.. ఈ ఏరియాలోనే ఉంటారు. అలాంటి ప్రదేశం.. ఒకప్పుడు ఆదిమానవులకు ఆవాసం అంటే ఆశ్చర్యం కలుగుతోంది ప్రతీ ఒక్కరికి.
జూబ్లీహిల్స్ పరిధిలోని BNR హిల్స్ దగ్గరున్న తాబేలు గుండు కింద కొత్త రాతి యుగానికి చెందిన ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. చూడటానికి అవి మామూలు రాళ్లలాగానే ఉన్నాయి. కానీ మొనతేలి ఉన్నాయి. అంటే.. ఆది మానవులు ఆహారం కోసం.. ఆయుధాలుగా ఆ రాళ్లను వాడుకున్నారని అర్థమవుతోంది.
ఆదిమానవుల్లోనూ చాలా రకాలున్నారు. జూబ్లీహిల్స్‌లో నివసించిన ఆదిమానవులు.. లేటెస్ట్ మనుషులు అని కూడా చెప్పుకోవచ్చని సైంటిస్టులు అంటున్నారు. వీళ్లకు తెలివితేటలు ఎక్కువ. చుట్టూ ఉన్న చెట్లు, రాళ్ల వంటి వాటిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో వీళ్లకు తెలుసు. వీళ్లు నీటిని వాడి వ్యవసాయం చేసేవాళ్లు, పశువుల్ని కూడా పెంచుకునేవాళ్లు.
తాబేలుగుండు వీళ్లకు తాత్కాలిక ఆవాసంగా ఉపయోగపడిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. రాతి గొడ్డళ్లను పరిశీలించిన నిపుణులు.. ఇవి పాత రాతియుగపు గొడ్డళ్ల కంటే.. ఆధునికంగా ఉన్నాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తాబేలు గుండు దగ్గర 6వేల ఏళ్ల కిందట సుమారు 20మంది జీవించి ఉండవచ్చని పురావస్తు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఈ చుట్టుపక్కల ఏవైనా ఆనవాళ్లు లభిస్తాయేమోనని పరిశోధనలు సాగిస్తున్నారు.