సూర్యా భాయ్, దూబే విధ్వంసం, వైఫల్యాల బాటలో పృథ్వీ షా

దేశవాళీ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పలువురు స్టార్ క్రికెటర్లు సత్తా చాటుతుంటే మరికొందరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు సైతం ఈ టోర్నీలో ఆడుతుండగా.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, మహ్మద్ షమీ మెరిసారు.

  • Written By:
  • Publish Date - December 3, 2024 / 05:54 PM IST

దేశవాళీ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పలువురు స్టార్ క్రికెటర్లు సత్తా చాటుతుంటే మరికొందరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు సైతం ఈ టోర్నీలో ఆడుతుండగా.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, మహ్మద్ షమీ మెరిసారు. అటు సంజూ శాంసన్, పృథ్వీ షా మాత్రం వైఫల్యాల బాటలో ఉన్నారు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో దుమ్మురేపాడు. భారీ షాట్లతో తనదైన మెరుపులు మెరిపించాడు. కేవలం 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లో 70 పరుగులు చేశాడు. అటు శివమ్ దూబే కూడా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ముంబై హిట్టర్ భారీ సిక్సర్లతో సర్వీసెస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దూబే కేవలం 32 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 71 రన్స్ చేశాడు. సూర్యకుమార్, దూబే మెరుపులతో ముంబై 192 పరుగులు చేసింది. ఇదే ఇన్నింగ్స్ లో పృథ్వీ షా మాత్రం నిరాశపరిచాడు. ఇటీవల వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన పృథ్వీ షా వరుసగా రెండో మ్యాచ్ లోనూ డకౌటయ్యాడు.

ఇదిలా ఉంటే కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ కూడా నిరాశపరిచాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో 75 పరుగులతో మెరిసిన సంజూ తర్వాత తక్కువ స్కోర్లకే ఔటవుతున్నాడు.తాజాగా ఆంధ్రాతో మ్యాచ్ లో సంజూ శాంసన్ 7 పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోని ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. సర్వీసెస్ తో మ్యాచ్ ఈ ముంబై పేసర్ 4 వికెట్లతో సంచలన స్పెల్ నమోదు చేశాడు. ఇద్దరు బ్యాటర్లను డకౌట్ చేసిన శార్థూల్ మరో 2 వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. గత మ్యాచ్ లో శార్థూల్ చెత్త బౌలింగ్ తో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో భారీ ధర పలికిన వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొడుతున్నాడు. విదర్భ జట్టుకు సారథిగా ఉన్న జితేశ్ ఛత్తీస్ ఘడ్ తో మ్యాచ్ లో కేవలం 14 రన్స్ కే 38 పరుగులు చేశాడు. దీనిలో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవల మెగావేలంలో ఆర్సీబీ జితేశ్ ను 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక పంజాబ్ కింగ్స్ రిటైన్ ప్లేయర్ శశాంక్ సింగ్ బంతితో మెరిసాడు. ఛత్తీస్ గడ్ తో మ్యాచ్ లోనే శశాంక్ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ టోర్నీలో ఫామ్ కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్ పై 3 కీలక వికెట్లు పడగొట్టిన షమీ తాజాగా బీహార్ పై కూడా ఆకట్టుకున్నాడు.