టీమిండియాలో అవకాశాల కోసం ఎంతోమంది యువ ఆటగాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు.. జట్టులో చోటు దక్కిన ప్రతీ ప్లేయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే తర్వాత ఫ్యూచర్ ఉంటుంది… అదే సమయంలో కొందరు యువ ఆటగాళ్ళు మాత్రం తమ కెరీర్ ను తామే చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ముంబై క్రికెటర్ పృథ్వీ షా పేరు చెప్పొచ్చు. క్రికెటర్ గా ఎదిగేక్రమంలో కేవలం ఆట మాత్రమే ఉంటే సరిపోదు.. ఫిట్ నెస్ తో పాటు క్రమశిక్షణ కూడా ముఖ్యమే…. డిసిప్లీన్ లేకుంటే ఎలాంటి ప్లేయర్ నైనా సెలక్టర్లు పక్కన పెట్టేస్తారు.. తాజాగా పృథ్వీ షాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ యువ ఆటగాడిపై ముంబై క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. ముంబై రంజీ టీమ్ నుంచి తప్పించింది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టడం, ఆలస్యంగా రావడం, ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టకపోవడం.. కోచ్‌ల మాటలు వినకపోవడం వంటి తప్పిదాలతోనే అతన్ని జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
18 ఏళ్ల వయసులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి మ్యాచ్‌లోనే శతకంతో సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత నిలకడలేమి ఆటతో పాటు గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. ముఖ్యంగా అతని ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. 24 ఏళ్ల వయసులోనే పొట్ట.. బట్టతలతో కనిపిస్తున్న పృథ్వీ షా.. అధిక బరువుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిభావంతుడైన పృథ్వీ షా చేజేతులా తన కెరీర్ నాశనం చేసుకుంటున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన సారథ్యంలో ఆడిన ఆటగాళ్లంతా టీమిండియా స్టార్లుగా ఎదిగితే పృథ్వీ షా మాత్రం అనవసర వివాదాలు, గొడవలతో ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నాడు.
టీమిండియాలోకి రీఎంట్రీ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు రంజీ టీమ్‌లో కూడా చోటు కోల్పోయాడు. ప్రతిభకు లోటు లేని పృథ్వీ షాలో క్రమశిక్షణ కొరవడి, ఫిట్‌నెస్ లేక చేజేతులా కెరీర్‌ను దెబ్బ తీసుకుంటున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా తరఫున అతను చివరగా 2021 జూలైలో శ్రీలంకతో టీ20 మ్యాచ్ ఆడాడు.
ఇటీవల జరిగిన ఇరానీ కప్‌లో కూడా పృథ్వీ షా ముంబై తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయినా అతని తీరు పట్ల ఆగ్రహంగా ఉన్న ముంబై క్రికెట్ అసోసియేషన్ జట్టు నుంచి తప్పించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. మరోవైపు పృథ్వీ షా మాత్రం ఆటను షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.