హీరో టూ జీరో చేజేతులా కెరీర్ నాశనం

ఆటల్లో రాణించాలంటే ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు...దానికి తగ్గట్టు పట్టుదల, కృషి , అన్నింటికీ మించి క్రమశిక్షణ ఉండాలి...ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లీన్ లేకుంటే ఎవ్వరూ ఎదగలేరు...అటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యం..ఈ రెండూ లేకపోవడంతోనే యువ క్రికెటర్ పృథ్వీ షా కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో పడింది.

  • Written By:
  • Publish Date - November 27, 2024 / 06:25 PM IST

ఆటల్లో రాణించాలంటే ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు…దానికి తగ్గట్టు పట్టుదల, కృషి , అన్నింటికీ మించి క్రమశిక్షణ ఉండాలి…ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లీన్ లేకుంటే ఎవ్వరూ ఎదగలేరు…అటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యం..ఈ రెండూ లేకపోవడంతోనే యువ క్రికెటర్ పృథ్వీ షా కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో పడింది.పృథ్వీ షా ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టగల సామర్థ్యం ఉన్న బ్యాటర్. కానీ.. ఐపీఎల్ 2025 వేలంలో 75 లక్షల ధరకే వస్తున్నా ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు. దీనికి కారణం అతని స్వయంకృతాపరాధమే…క్రమశిక్షణారాహిత్యం,ఫిట్‌నెస్‌, ఫామ్ లేమి కారణంగా ఈ యంగ్ క్రికెటర్ కెరీర్ గాడితప్పింది. పృథ్వీ షా బ్యాటింగ్‌ను చూసి టీమిండియాకు మరో కోహ్లీ దొరికాడని అంతా అనుకున్నారు. భవిష్యత్తులో టీమిండియాను ఏలుతాడని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు మెచ్చుకున్నారు. కానీ 6 ఏళ్ల తర్వాత అదే కుర్రాడు ఐపీఎల్‌లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

భారత అండర్-19 ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా వెలుగులోకి వచ్చిన పృథ్వీ షా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వాస్తవానికి పృథ్వీ షా ఫామ్‌లో ఉండి ఉంటే.. వేలానికి ఢిల్లీ క్యాపిటల్స్ వదిలేది కాదు. కనీసం14 కోట్లతో రిటేన్ చేసుకునేది. కానీ..వేలానికి వదిలేయడంతో ఢిల్లీ జట్టుతో అతని ఏడేళ్ల బంధానికి తెరపడింది. టాలెంట్ ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు క్రమశిక్షణ ఉండాలి అనే పెద్దల మాట పృథ్వీ షా కెరీర్‌ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. చిన్నవయసులోనే డబ్బు,ఫేమ్ రావడంతో పృథ్వీ షా గాడి తప్పాడు. చెడు స్నేహాలతో పాటు ఆటపై ఫోకస్ తగ్గింది. దానికి తోడు గాయాలు అతన్నివెంటాడాయి. 2018 ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం అతని కెరీర్‌‌ను అగాథంలోకి నెట్టింది. ఆ తర్వాత దగ్గు సిరప్ తాగి డోపింగ్ టెస్ట్‌లో విఫలమై బీసీసీఐ నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌లో సత్తా చాటినా.. నిలకడలేమి అతనికి అవకాశాలు రాకుండా చేసింది. అవకాశాలు వచ్చినా తుది జట్టులో ఆడలేని పరిస్థితి ఏర్పడింది

ఇపుడు పృధ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్‌తో పాటు పరుగులు చేసి ఫామ్ నిరూపించుకోవాలి. గతంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇలానే అవమానాల్ని ఎదుర్కొన్నాడు. కానీ.. ఇప్పుడు భారత్ టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అయిపోయాడు. ఫామ్, ఫిట్‌నెస్ పరంగానే కాదు.. క్రమశిక్షణ విషయంలోనూ పృథ్వీ షాపై ఫిర్యాదులు ఉన్నాయి. వీధి గొడవలు, ప్రాక్టీస్‌కి డుమ్మా కొట్టడం, శరీర బరువుని అదుపులో ఉంచుకోకపోవడం .. దాని కారణంగా ఫీల్డింగ్‌లో నిర్లక్ష్యం.. ఇవన్నీ పృథ్వీ షా దిద్దుకోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు కూడా పృథ్వీ షాకి సూచిస్తున్నారు.