తెలంగాణలో సర్వేలు, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా వస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ తన పార్టీని బలోపేతం చేయాలని పావులు కదుపుతోంది. అందులో భాగంగా బస్సుయాత్రలు, మ్యానిఫెస్టోలతో అస్త్రాలను సిద్దం చేస్తోంది. ఈనెల 31న కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభను ప్రియాంకా గాంధీతో నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని ముల్లు రవి నివాసంలో జూపల్లి, జగదీశ్వర్ రావు, ప్రతాప్ గౌడ్, విజయభాస్కర్ రెడ్డి తదితరులు ఆదివారం చర్చించారు. గతంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే క్రమంలోనే సభ నిర్వహించాలని చూశారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా పెద్ద ఎత్తున దీనిని ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేశారు.
పాలమూరులో నిర్వహించే ప్రజాభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఉన్న కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పాలన్నారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ఎన్నికల్లో విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ఎవరెవరు హాజరవుతారు, ఎన్ని గంటలకు నిర్వహిస్తారు అనేదానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో అన్ని సామాజిక వర్గా ప్రజలతో పాటూ, యువకులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. గతంలో ఏర్పాటు చేసిన ప్రతి సభలో ఏదో ఒక హామీని, పథకాన్ని గురించి చెప్పేవారు. ఈ సారి ఏ ఫథకాలు కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. పైగా ఈనెలాఖరుకల్లా మ్యానిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సభ సాక్షిగా ఏమైనా విడుదల చేస్తారా అన్నది వేచి చూడాలి.
T.V.SRIKAR