Chandrababu: చంద్రబాబు ఓటుకు నోటు కేసులో పురోగతి.. అక్టోబర్ 4న సుప్రీం కోర్టులో లిస్ట్ అయిన కేసు

చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చిక్కుకున్న నేపథ్యంలో మరిన్ని కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత ఆరేళ్ల క్రితం తెలంగాణ ఏసీబీ పరిధిలోని ఓటుకు నోటు కేసు మరో సారి తెరపైకి వచ్చింది. దీంతో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏంటా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 1, 2023 / 09:07 AM IST

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. దీంతో పాటూ తెలంగాణ ఏసీబీ నుంచి ఈ కేసును సీబీఐకి బదలాయించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ద్విసభ్య ధర్మాసనం వాదనలకి రావాలని అక్టోబర్ 4కి లిస్ట్ చేసింది. కోర్టు నంబర్ 16 లో ఐటెమ్ నంబర్ 109గా లిస్ట్ అయినట్లు తెలిపింది.

ఎసీబీ నుంచి సుప్రీంకి బదిలీ..

తెలంగాణలో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ఏసీబీ అధికారుల కెమెరాలకే అడ్డంగా దొరికిపోయారు అప్పటి తెలుగుదేశం నాయకులు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఆయనపై కేసు నమోదు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 6 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి కేసులో పురోగతి రావడం పై కాస్త ఆసక్తి నెలకొంది. నిజానికి చంద్రబాబుని అప్పట్లోనే అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. కానీ అప్పట్లో ముఖ్యమంత్రి కావడంతో వాటిని ఏదో విధంగా కేసు వెనకపడిపోయింది. దీని వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా అక్టోబర్ 4న సుప్రీం కోర్టులో లిస్ట్ లోకి వచ్చింది.

రేవంత్ పై ప్రభావం ఎంత..

ఈ కేసు పురోగతిలోకి వస్తే ఇటు రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇందులో ఆడియో, వీడియో టేపుల్లో నోట్ల కట్టలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీనిపై కోర్టుకు ఏం చెబుతారు అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నకేసు ఒక్కసారిగా బయటకు రావడం వెనుక రాజకీయ కోణం ఉందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకి కళ్లుం వేయడం కోసం ఇందులో బీజేపీ పెద్దల హస్తం ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఏది ఏమైనా ఈ వారం చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరి కేసులు సుప్రీం కోర్టులో విచారణకు రావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇరువురికి తరఫు లాయర్లు ఏలాంటి వాదనలు వినిపిస్తారు.. ఏ రకమైన తీర్పులు వస్తోయో తెలియాలంటే వారం వేచి చూడక తప్పదు.