Project Tiger: పెరుగుతున్న పులుల సంఖ్య.. దేశంలో ఎన్ని పులులున్నాయంటే.. లెక్కచెప్పిన మోదీ

ఐదు దశాబ్దాలక్రితం పులుల సంరక్షణ కోసం కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు టైగర్ వల్ల పులుల స‌ంఖ్య పెరుగుతోంది. ఈ విషయం తాజా గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. 2022 నాటి అంచనాల ప్రకారం దేశంలో 3,167 పులులు ఉన్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - April 10, 2023 / 05:23 PM IST

Project Tiger: దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఐదు దశాబ్దాలక్రితం పులుల సంరక్షణ కోసం కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు టైగర్ వల్ల పులుల స‌ంఖ్య పెరుగుతోంది. ఈ విషయం తాజా గణాంకాలు చూస్తే అర్థమవుతోంది. 2022 నాటి అంచనాల ప్రకారం దేశంలో 3,167 పులులు ఉన్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. దేశమంతా పులుల సంఖ్య పెరుగుతుంటే, తెలంగాణలో మాత్రం పులుల సంఖ్య తగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మన జాతీయ జంతువు పెద్దపులి అనే సంగతి తెలిసిందే.
40 వేల పులులు
గతంలో మన దేశంలో పులుల సంఖ్య 40 వేలకుపైనే ఉండేది. గత శతాబ్దం ప్రారంభంలో అయితే, లక్ష వరకు పులులుండేవి. అయితే, అనేక కారణాల వల్ల వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. పులుల్ని వేటాడటం, నాగరికత పేరుతో అడవుల్ని నరికివేయడం వంటి చర్యల ద్వారా పులుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. 40 వేలు ఉండే పులుల సంఖ్య 1970వ దశకానికి 1,800కు పడిపోయింది. దాదాపు ఇవి అంతరించే దశకు చేరుకున్నాయి. దీంతో ఈ అంశంపై అప్పటి కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పులుల్ని రక్షించేందుకు 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించింది. పులుల్ని కాపాడేందుకు ఇవి ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్ని ఏర్పాటు చేసింది.

మొదట 18,278 చదరపు కిలోమీటర్ల పరిధిలో, తొమ్మిది టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 75 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 53 టైగర్ రిజర్వ్ ఫారెస్టు ఏరియాలున్నాయి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.4 శాతం టైగర్ రిజర్వ్ ఏరియా ఉందంటే దీనికి కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చర్యల ద్వారా ప్రస్తుతం పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నపులుల్లో 70 శాతంపైగా ఇప్పుడు మన దేశంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి ప్రాజెక్ట్ టైగర్ ఎంతటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు.


పులుల సంఖ్యపై వాస్తవాలివి
పులుల గురించి ప్రధాని మోదీ నివేదిక వెల్లడించారు. దీని ప్రకారం.. 2022 నాటికి దేశంలో 3,167 పులులు ఉన్నాయి. అయితే, ప్రాజెక్టు టైగర్ మొదటి దశలోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోలేదు. 2006లో పులుల సంఖ్య 1,411కు పడిపోయింది. వేట, తదితర కారణాల వల్ల 2005 నాటికి రాజస్థాన్‌లోని సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి, 2008 నాటికి మధ్యప్రదేశ్, పన్నా టైగర్ రిజర్వ్ నుంచి పులులు పూర్తిగా అంతరించాయి. సంరక్షణా చర్యల్లో భాగంగా ఆయా రిజర్వు ఫారెస్టుల్లో వాటిని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో ఈ ప్రాంతాల్లో మళ్లీ పులులు పెరిగాయి. 2006లో పులుల సంఖ్య 1,411, 2010లో 1,706 పులులు, 2014లో 2,226 పులులు, 2016లో 1,411 పులులు, 2018లో 2,967 పులులు ఉండేవి. 2018తో పోలిస్తే 2022 నాటికి పులుల సంఖ్య రెండు వందలు పెరిగింది. గత రెండు దశాబ్దాల్లో పులుల సంఖ్య రెట్టింపైంది.
పులుల్ని ఎలా లెక్కిస్తారు?
సాధారణంగా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల్ని లెక్కిస్తారు. పులుల గణన విషయంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. కారణం.. ఆధునిక కెమెరాల సాయంతో అటవీ జంతువుల గణన చేపట్టిన తొలి దేశంగా ఇండియా నిలిచింది. 2018-2019లో పులుల గణన అత్యంత సమగ్రంగా జరిగింది. రిజర్వ్ ఫారెస్టుల పరిధిలో 141 చోట్ల, 26,838 మోషన్ సెన్సర్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు. ఈ గణనలో అధికారులు, నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దాదాపు 44 వేల మంది పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి 20 రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు పరిశీలించి, ఇతర మార్గాల్లో పులుల్ని, ఇతర అటవీ జంతువుల్ని లెక్కించారు. గతంలో మాత్రం పులులు, అటవీ జంతువుల్ని లెక్కించడం కష్టంగా ఉండేది. జంతువుల పాదముద్రలు, మలం, గోళ్లు వంటివి సేకరించి వాటిని లెక్కించేవాళ్లు. ఇప్పుడు మాత్రం కెమెరాల సాయంతో ఇది చాలా సులభమైంది.
బందీపూర్ సందర్శించిన మోదీ
ప్రాజెక్ట్ టైగర్ మొదలై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలోని బందీపూర్‌లో పర్యటించారు. అక్కడి టైగర్ రిజర్వ్ ఫారెస్టులో, ఓపెన్ టాప్ జీపులో 20 కిలోమీటర్లు పైగా ప్రయాణించారు. ఖాకీ ప్యాంట్, టీ షర్ట్, టోపీ ధరించి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి వణ్యప్రాణుల్ని చూస్తూ సేదతీరారు. ఈ రిజర్వ్ ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదుమలైలోని తెప్పకాడు ఏనుగుల సంరక్షణా శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడ ఏనుగులకు ఆహారం అందించారు. అనంతరం మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో టైగర్ ప్రాజెక్టుపై ఒక బుక్‌లెట్ విడుదల చేశారు.