Konda Vishweshwar Reddy : ఆస్తి 4 వేల కోట్లు.. కానీ సొంత కారు కూడా లేదు

దేశంలోనే అత్యం ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల్లో ఒకరుగా నిలిచారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (Konda Vishweshwar Reddy).

 

 

 

దేశంలోనే అత్యం ధనవంతులైన ఎంపీ అభ్యర్థుల్లో ఒకరుగా నిలిచారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (Konda Vishweshwar Reddy). ఎంపీ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఆయన తన ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ అఫిడవిట్‌లో తనకు ఉన్న ఆస్తుల వివరాలను క్లియర్‌గా వివరించారు. కొండా దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం.. విశ్వేశ్వర్‌ ‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు మొత్తం ఆస్తి 4 వేల 4 వందల 88 కోట్ల. ఇవి కేవలం చరాస్తులు మాత్రమే. వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తుల విలువ 4 వేల 5 వందల 68 కోట్ల 21 లక్షలు. ఈ ఆస్తులతో విశ్వేశ్వర్​ రెడ్డి దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరుగా నిలిచారు. విశ్వేశ్వర్‌‌రెడ్డికి 11 వందల 78 కోట్ల 72 లక్షల చరాస్తులు ఉండగా.. ఆయన భార్య సంగీతారెడ్డికి 3 వేల 2 వందల 3 కోట్ల చరాస్తులు ఉన్నాయి.

ఇక ఆయన కొడుకు విరాజ్‌‌ మాధవ్‌కు 107 కోట్ల 44 లక్షల చరాస్తులున్నట్టు అఫిడవిట్‌లో చూపారు. విశ్వేశ్వర్‌‌రెడ్డి పేరు మీద స్థిరాస్తులు 71 కోట్ల 34 లక్షలు కాగా.. సంగీతారెడ్డి పేరు మీద 3 కోట్ల 6 లక్షలు, విరాజ్‌‌ మాధవ్‌ పేరు మీద 1 కోటీ 27 లక్షల స్థిరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. విశ్వేశ్వర్‌‌ రెడ్డికి అప్పులు 1 కోటీ 76 లక్షల అప్పులు ఉన్నట్టు చెప్పారు. సంగీతారెడ్డి అప్పులు 12 కోట్లుగా చూపించారు. అపోలో హాస్పిటల్స్‌లోనే కొండాకు ఎక్కువగా షేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 9 వందల 73 కోట్లు విలువైన షేర్లు కొండా పేరు మీద. 1500 కోట్ల విలువైన షేర్లు ఆయన భార్య సంగీత రెడ్డి పేరు మీద ఉన్నాయి. హైదరాబాద్‌‌తో పాటు చుట్టుపక్కల మొత్తం తన పేరు మీద 70 ఎకరాలు, తన భార్యత పేరు మీద 14 ఎకరాల భూమి ఉన్నట్టు చెప్పారు విశ్వేశ్వర్‌ రెడ్డి.

ఇవి కాకుండా 45 వేల 4 వందల 32 స్క్వేర్‌‌ ఫీట్ల విస్తీర్ణం గల రెసిడెన్షియల్‌ బిల్డింగులు కూడా ఉన్నట్టు చెప్పారు. బంజారాహిల్స్‌‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఒకటి, ఉస్మాన్‌‌గంజ్‌‌లో 14 షాపులు, జూబ్లీహిల్స్‌‌ రోడ్డు నెంబర్‌‌ 86లో ఒక షాపింగ్‌‌ కాంప్లెక్స్‌‌ కొండాకు ఉన్నాయట. అయితే, 2019లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వారికి కేవలం 8 వందల 95 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్టు ప్రకటించారు. 2014లో బీఆర్ఎస్​ టికెట్‌‌పై చేవెళ్ల నుంచి పోటీ చేసి విజయం సాధించగా.. అప్పుడు ఆస్తులు 5 వందల 28 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. కానీ ఈ పదేళ్లలోనే 5 వందల నుంచి దాదాపు 5 వేల కోట్లకు కొండా ఆస్తులు పెరగడం హాట్‌టాపిక్‌గా మారింది.