టీమిండియా వెటరన్ బ్యాటర్ చటేశ్వర పుజారా పరుగుల దాహం కొనసాగుతోంది. దేశవాళీ క్రికెట్ లో మరోసారి పుజారా దుమ్మరేపుతున్నాడు. తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ డబుల్ సెంచరీ బాదేశాడు. ఛత్తీస్ ఘడ్ తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ఈ సౌరాష్ట్ర క్రికెటర్ ద్విశతకం సాధించాడు. పుజారా ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు ఉన్నాయి. దీంతో ఛత్తీస్ ఘడ్ భారీస్కోరుకు సౌరాష్ట్ర ధీటైన సమాధానమిస్తోంది. ఈ ఇన్నింగ్స్ తో పుజారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పలు అరుదైన రికార్డులను అందుకున్నాడు. విండీస్ దిగ్గజం లారా రికార్డును సైతం బ్రేక్ చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో పుజారాకు ఇది 66వ శతకం. దీంతో లారా 65 శతకాల రికార్డును పుజారా అధిగమించాడు. ఇక రంజీ ట్రోఫీలో అతనికిది 25వ శతకం. తద్వారా వినోద్ కాంబ్లీ, బద్రీనాథ్ లను సైతం పుజారా అధిగమించాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ముగ్గురు భారత క్రికెటర్లకు అతను చేరువయ్యాడు. రాహుల్ ద్రావిడ్ 68 శతకాలు చేయగా… సచిన్ టెండూల్కర్, గవాస్కర్ 81 సెంచరీలతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే ఛత్తీస్ ఘడ్ పై సెంచరీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 21 వేల పరుగుల మైలురాయిని కూడా పుజారా అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో గవాస్కర్ 25 వేల 834 రన్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా… టెండూల్కర్, ద్రావిడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా జాతీయ జట్టుకు దూరమైన పుజారా 2024లో మాత్రం సూపర్ ఫామ్ తో దూసుకెళుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్ షిప్ తో పాటు రంజీ సీజన్ లో కలిపి ఆరు శతకాలు సాధించాడు. ఇటీవల కౌంటీ సీజన్ లోనూ పుజారా పరుగుల వరద పారించాడు. ససెక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఈ సీనియర్ భారత క్రికెటర్ 500కు పైగా రన్స్ చేశాడు. దీని రెండు శతకాలు ఉండగా.. ఇప్పుడు రంజీల్లోనూ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
ఒకవిధంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు పుజారా ఫామ్ సెలక్టర్లకు సవాల్ గానే చెప్పాలి. గత రెండు పర్యాయాలు భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచినప్పుడు పుజారా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్ గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో పుజారా నాలుగో భారత ప్లేయర్ గా ఉన్నాడు. పుజారా ఇప్పటి వరకూ ఆసీస్ పై 24 మ్యాచ్ లలో 2033 పరుగులు చేయగా… దీనిలో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో పాటు ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. పుజారా చివరిసారిగా గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ జట్టుకు ఆడాడు. ఆసీస్ తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో మాత్రం నిరాశపరచడంతో తర్వాత జట్టుకు దూరమయయాడు. అయితే ఈ సారి ఆసీస్ టూర్ కు పుజారా ఎంపికవడం కష్టంగానే కనిపిస్తోంది.