ఐపీఎల్ మెగావేలం కోసం ఫ్రాంచైజీలు తమదైన వ్యూహాలతో రెడీ అవుతున్నాయి. ఇటీవల రిటెన్షన్ జాబితాలో పంజాబ్ అందరికంటే తక్కువగా ఇద్దరిని మాత్రం తమతో ఉంచుకుని భారీ అమౌంట్ తో వేలంలోకి అడుగుపెడుతోంది. పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్‌లపై మాత్రమే నమ్మకముంచింది. శశాంక్ కోసం 5.5 కోట్లు , ప్రభసిమ్రాన్ సింగ్ కోసం 4 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు పంజాబ్ ఫ్రాంచైజీ పర్స్‌లో 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. పెద్ద మొత్తంతోనే వేలంలోకి వెళుతున్న పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ మెగా ప్లాన్ వేశాడు. వేలంలో వేలంలో రిషబ్ పంత్‌ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. అతని కోసం భారీగా ఖర్చు చేసేందుకు ప్రీతి జింతతో కలిసి సంప్రదింపులు కూడా జరిపాడని తెలుస్తోంది. పంత్ తో పాటు రవి బిష్ణోయ్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో మరియు అర్ష్‌దీప్ సింగ్‌లపై కూడా పాంటింగ్ కన్నేశాడు.
వాస్తవానికి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఈ పరిస్థితిలో, రిషబ్ పంత్ వాళ్లకు బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు.ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే పంత్ మరియు పంజాబ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఇద్దరూ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చినవాళ్లే. పాంటింగ్ కు పంత్ సత్తా ఏంటో తెలుసు. అంతేకాదు పంత్ కెప్టెన్ మరియు మిడిలార్డర్లో బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపర్ గానూ జట్టుకు ఉపయోగపడతాడు. దీంతో మెగావేలంలో పంత్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు పంజాబ్ కింగ్స్ సై అంటోంది. పంత్ తన కెరీర్లో ఇప్పటివరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లలో 3284 పరుగులు చేశాడు. కాగా రైట్ టూ మ్యాచ్ ఆప్షన్ ద్వారా కూడా పాంటింగ్ పెద్ద ప్లానే వేశాడు. పంజాబ్ కింగ్స్‌కు గరిష్టంగా 4 రైట్ టు మ్యాచ్ కార్డ్‌లను ఉపయోగించుకునేందుకు ఛాన్సుంది. ఈ నేపథ్యంలో వేలంలో వాటిని సరిగ్గా వినియోగించుకుని కీలక ఆటగాళ్ళను వెనక్కి తీసుకునేందుకు ప్లాన్ చేసింది.
ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ అర్ష్‌దీప్ సింగ్‌ను రిటైన్ చేయలేదు. దీంతో పంజాబ్ అతనిని రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా జట్టులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. అర్ష్‌దీప్ ఇప్పటి వరకు 65 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు తీశాడు. గత సీజన్లో అతను 19 వికెట్లు పడగొట్టాడు. అలాగే RTM ద్వారా లియామ్ లివింగ్‌స్టోన్‌ను కూడా తీసుకోవాలని భావిస్తుంది. స్టోన్ గత సీజన్లో 7 మ్యాచ్‌ల్లో 111 పరుగులు చేశాడు. లీగ్‌లో 39 మ్యాచ్‌ల్లో 939 పరుగులు చేశాడు. ఇక రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి జానీ బెయిర్‌స్టోను కూడా తీసుకునే ఛాన్సుంది. బెయిర్‌స్టో రాకతో జట్టుకు ఇద్దరు వికెట్‌కీపింగ్ ఆప్షన్స్ ఉంటాయి. మొత్తం మీద పంజాబ్ నాలుగు ఆర్టీఎంలనూ ఉపయోగిస్తే పలువురు కీలక ఆటగాళ్ళు మళ్ళీ జట్టులోకి రావడం ఖాయమైనట్టే.