Purandeswari: ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అంటున్న చిన్నమ్మ

బీజేపీకి వైసీపీ మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యం. అయితే ఆ బంధానికి బీటలు వారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైసీపీపై మాటల తూటాలతో చిన్నమ్మ విరుచుకుపడటం చూస్తుంటే ఏదో జరగబోతోందనే అనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 08:00 PM IST

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పురంధేశ్వరి వైసీపీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో పాటు ఏపీకి బీజేపీ ఏమీ ఇవ్వడం లేదన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. తాము ఏమేం ఇచ్చింది లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. అంతేకాదు పోలవరం కట్టడం చేతకాకపోతే కేంద్రానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి అధికార పక్షాన్ని విమర్శించడం మామూలే అనుకోవచ్చు. కానీ పురంధేశ్వరి మాటలు అలా లేవు. తొలి ప్రసంగంతోనే తన టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పేశారు చిన్నమ్మ. గతంలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీపై కాస్త మెతక వైఖరినే అవలంభించారని చెప్పాలి. ప్రభుత్వంపై అప్పుడప్పుడు విమర్శలు చేసినా మాటల్లో పదును, చేతల్లో దూకుడు ఏ మాత్రం కనిపించేది కాదు. ఏదో తిట్టాలి కాబట్టి తిట్టాం అన్నట్లు ఉండేది సీన్. కానీ ఇంతకు ముందో లెక్క ఇకముందో లెక్క అంటోంది చిన్నమ్మ.

విచిత్రమేమిటంటే టీడీపీనో, జనసేన నేతలో ఏమైనా అంటే ప్రెస్‌మీట్లు పెట్టి మైకాసురులుగా మారిపోయే వైసీపీ మంత్రులు మాత్రం పురంధేశ్వరి విషయంలో మౌన మంత్రాన్ని ఆశ్రయించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెపై ఎదురు దాడి చేయడానికి ప్రయత్నించలేదు. ఎందుకొచ్చిన తంటా అనుకున్నారో లేక పైకమాండ్ నుంచి స్క్రిప్ట్ రాలేదో కానీ ఎవరూ నోరు తెరవలేదు. పవన్‌పై ప్రెస్‌మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం బీజేపీని విమర్శించడానికో లేక చిన్నమ్మ మాటలకు కౌంటర్ ఇవ్వడానికో ప్రయత్నించలేదు. ఎక్కువ తక్కువలు మాట్లాడితే ఢిల్లీ నుంచి షంటింగ్ తప్పదని జగన్ భయపడ్డారని ఏపీ పాలిటిక్స్‌లో చర్చ సాగుతోంది. గతంలో ఒకరిద్దరు నేతలు అత్యుత్సాహానికి పోయి బీజేపీపై కాస్త ఎక్కువగానే స్పందించి ఆ తర్వాత తలంటించుకున్నారు. అందుకే ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదన్నది జగన్ ఆలోచన.

Purandeshwari has been targeting YCP leaders

ఏపీలో వైసీపీ పరిస్థితేంటో అందరికీ అర్థమైపోయింది. ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న స్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం సాగుతోంది. ఇటీవల చంద్రబాబును బీజేపీ అగ్రనేత అమిత్ షా పిలిపించి మరీ మాట్లాడటం చూస్తుంటే రాజకీయం రంగు మారినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లు చంద్రబాబును దగ్గరకు కూడా రానివ్వని బీజేపీ ఒక్కసారిగా వ్యూహం మార్చుకోవడానికి కారణం ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులే. గత ఎన్నికల్లో ఉన్నంత దూకుడు వైసీపీలో లేదు. ప్రతిపక్షం బలంగా పుంజుకుంది. టీడీపీ, జనసేన కలసి పోటీ చేస్తే తమకు ఓటమి తప్పదని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీతో సున్నం పెట్టుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు. ఏమైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భయపడుతున్నారు. ఆయన జుట్టు కేంద్రం చేతిలో ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. అవినీతి కేసుల నుంచి బాబాయి వివేకా గొడ్డలి కేసు వరకూ ప్రతిదాంట్లోనూ తను కూరుకుపోయానని వైసీపీ అధినేతకు తెలుసు. అందుకే మిగిలిన పార్టీలపై నోరేసుకుని ఎగబడినట్లు పురంధేశ్వరి విషయంలో దూకుడుగా వెళ్లొద్దని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి వైసీపీని ఎన్‌డీఏ కూటమిలో చేరాలని షా ముందు కోరారని చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. బీజేపీతో కలసి నడిస్తే ఏపీ ప్రజల్లో తమపై వ్యతిరేకత పెరుగుతుందని వైసీపీ భయపడింది. బయట నుంచి మద్దతు ఇస్తానని మాత్రమే జగన్ కమలం పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. జగన్ ఎప్పుడైనా హ్యాండ్ ఇస్తాడన్న అనుమానాలు వారిలో ఉన్నాయి. పైగా ఏపీలో వైసీపీ పరిస్థితి అంత బాగోలేదన్న నిఘా నివేదికలు వారి దగ్గరున్నాయి. దీంతో టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రబాబు ఆ అవకాశాన్ని వెంటనే అందుకున్నారు. అయితే ఇప్పుడే పొత్తుపై ఎలాంటి ప్రకటనలు లేకుండా ఎన్నికల సమయంలో దాన్ని బయట పెట్టాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. అందులో భాగంగానే పురంధేశ్వరిని బీజేపీ రంగంలోకి దించింది. సోము వీర్రాజు లాంటి వైసీపీ అనుకూల నేతను తప్పించడం ద్వారా కేడర్‌కు ఓ సంకేతం ఇవ్వడంతో పాటు రానున్న రోజుల్లో టీడీపీతో పొత్తుకు పురంధేశ్వరి కీలకం అవుతారని కమలం పెద్దల అంచనాగా ఉంది.

పురంధేశ్వరి తీరు చూస్తుంటే రానున్న రోజుల్లో వైసీపీని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది. బీజేపీ, టీడీపీ దోస్తీ కుదిరితే మాత్రం చిన్నమ్మ దూకుడును అడ్డుకోవడం కష్టమే. మరి దీనికి వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.