Amith Sha: అమిత్ షా.. పీవీ సింధుతో భేటీపై రాజకీయ వ్యూహం ఉందా.?

అమిత్ షా, పీవీ సింధూ భేటీ వెనుక అసలు రాజకీయ కోణం ఏంటి.

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 01:18 PM IST

తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా బీజేపీ చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. పార్టీ ముఖ్య నేతలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. అయితే తాజాగా అమిత్ షా ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు. హైదరాబాద్ లో తన తండ్రిని వెంటపెట్టుకొని మరీ వచ్చారు పీవీ సింధు. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

పొగడ్తల వర్షం..

ఈ మీటింగ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. పీవీ సింధు వెంట ఆమె తండ్రితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే బీజేపీ వర్గాల్లో మాత్రం ఈమె మర్యాదపూర్వకంగానే అమిత్ షా ను కలిసినట్లు తెలుస్తోంది. పీవీ సింధుతో భేటీపై అమిత్ షా ట్వీట్ చేశారు. పీవీ సింధు అద్బుతమైన క్రీడాకారిణి అని, తన అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు.ఈమె చేసిన కృషి, అంకితభావం యువతకు స్పూర్తిగా నిలుస్తుందని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రాజకీయ కోణం..

సింధూ భేటీ అనంతరం.. ఆమె గురించి అమిత్ షా ఆకాశానికి ఎత్తడాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరమైన అంశంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇన్ని సార్లు అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినా ఈమెను కలువలేదు. పైగా అంత గొప్పగా పొగిడేందుకు తాజాగా ఆమె ఎలాంటి పతకాలు తీసుకురాలేదు. ఒక వేళ తీసుకొని వచ్చింటే ఢిల్లీ వేదికగానే ఈమెకు సన్మానం చేసేవారు. అంతే గానీ ఇక్కడికి వచ్చి ఇంతలా భేటీ అవ్వాల్సిన అవసరం ఏముంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.  తెలంగాణ ఎన్నికల  నేపథ్యంలో అమిత్ షాతో పీవీ సింధు భేటీ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున ఆమె ఏమైనా ప్రచారం చేస్తుందా? అనే చర్చ లోలోపల జరుగుతోంది. ఒకవేళ ఇక్కడ ఆశించిన ఫలితం పెద్దగా రాకపోతే.. పార్లమెంట్ ఎన్నికల్లో ఈమెకు కొన్ని కీలక పగ్గాలు అప్పగించే అవకాశం కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా పూర్తి స్పష్టత రావాలంటే తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ వేచి చూడాలి. లేదా ఈలోపూ మరికొన్ని సార్లు ఇంకొందరు నాయకులతో భేటీ అయితే ఆలోచించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వార్తలకు బలం చేకూరుతుంది.

T.V.SRIKAR