అయితే ఇలా రెప్ప పాటు కాకుండా వారం రోజుల శ్రీవారి సేవలో తరింస్తే.. ఆహా అంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా అని భావిస్తారు ఆస్తికులు. అలాంటి వారి కోసం టీటీడీ శ్రీవారి సేవ అనే సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వాలంటీర్ నియామకానికి అర్హత:
హిందూ మతంలోని అన్ని సామాజిక వర్గాల వారూ దీనికి అర్హులే. కనీస వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. కొంత ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఇందులో స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ పాల్గొనవచ్చు. ఈ సేవను స్వీకరించాలంటే కనీసం 10 మంది సభ్యులతో సమూహంగా ఏర్పడాలి. హిందూ ధర్మం ప్రకారం తిలకం లేదా కుంకుమ, చందనంతో గోవిందనామాన్ని ధరించాలి. తమ గుర్తింపు ధృవ పత్రంతో పాటూ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన డాక్టర్ ద్వారా మెడికల్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. సేవలో పాల్గొనే వారి పేరు, తమతో పాటూ గ్రూపులోని సభ్యుల వివరాలు నెల రోజుల ముందుగా తిరుపతిలోని పరిపాలనా భవనానికి పోస్ట్ లేదా ఈ మెయిల్ రూపంలో పంపవచ్చు. ఇలా సేవ చేసే వారికోసం తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటకు శిక్షణా తరగతులను టీటీడీ ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. దీనికి క్రమం తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది.
టీం లీడర్/ కో ఆర్డినేటర్ విధులు:
తిరుమల తిరుపతి పరిపాలనా కార్యాలయానికి శ్రీవారి సేవ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజుల తరువాత తదుపరి తదుపరి ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. అందుకుగానూ ఈ గ్రూప్ కి సంబంధించి ఎవరో ఒకరు కో ఆర్డినేటర్ లేదా టీం లీడర్ గా బాధ్యతలు స్వీకరించవలసి ఉంటుంది. టీం లీడర్లు తమతో పాటూ వచ్చే సమూహంలోని వాలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్ లో అందించాలి. మీకు కేటాయించిన సేవా తేదీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు సేవాసదన్ లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.
వసతి, భోజన సదుపాయాలు:
పైన తెలిపిన ప్రాసెస్ పూర్తి అయిన తరువాత సేవకులకు ఉచితంగా బస కల్పిస్తారు. పురుషులకు అయితే పీఎస్-3 లో, మహిళలకు అయితే సేవాసదన్ లో వసతి కల్పిస్తారు. ఒక్కొక్కరికీ ఒక్కో లాకర్ కేటాయిస్తారు. లాకర్ లో సామానులు భద్రపరుచుకునేందుకు తాళం సేవకు వచ్చిన వారే తెచ్చుకోవాలి. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఉండవు.
శ్రీవారి సేవకుల విధులు:
శ్రీవారి సేవా సదన్ లో ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. ఒక రోజులో ఆరు గంటలు మాత్రమే శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ప్రసాద కేంద్రాలు, ఉచిత మంచినీరు, పాలు అందించడం, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. కనిష్టంగా వారం రోజులు.. గరిష్టంగా పది రోజులు శ్రీవారి సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి. స్వామి వారి అలంకారానికి అవసరమైన పూలు అల్లడం వంటివి చేయాలి. తలనీలాలు తీసే ప్రాంతంలో యాత్రికులకు గైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి వాలంటీర్ ను ఏదో ఒక రోజు ఆనందనిలయంలోని గర్భాలయంలో విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తుంది. అది అప్పటి పరిస్థితులను బట్టి మాత్రమే కేటాయిస్తారు. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు. అధికారులు కేటాయించిన చోట విధులు నిర్వర్తించేందుకు సిద్దంగా ఉండాలి. ఈ సేవ పూర్తిగా స్వచ్ఛందంగా చేసేది మాత్రమే. దీనికోసం టిటిడి ప్రత్యేకంగా ఎలాంటి ధన, వస్తు చెల్లింపులు చేయదు.
వాలంటీర్లకు ప్రత్యేక డ్రస్ కోడ్:
సేవకు వచ్చే వాలంటీర్లు మహిళలు అయితే మెరూన్ కలర్ బార్డర్ తో కూడిన ఆరెంజ్ రంగు చీర, మెరూన్ రంగు రవిక ధరించాలి. అదే పురుషులు అయితే తెలుపు రంగు ప్యాంటు, షర్ట్ / తెలుపు షర్డ్, పంచ ధరించవచ్చు. సేవలో ఉండే సమయంలో మాత్రమే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.
సన్నిధిలో సేవలో ఉన్నప్పుడు చేయకూడనివి:
మహిళా వాలంటీర్లు తలలో మల్లెపూలు పెట్టుకోకూడదు. సేవలో ఉన్నన్ని రోజులు విధులు నిర్వహించని సమయంలో నైటీలు, నైట్ డ్రస్సులు ధరించకూడదు. పురుషులు నైట్ షార్ట్, టీ షర్ట్స్ వంటివి ధరించరాదు. ఇవి పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలను అతిక్రమిస్తే వీరికి దేవస్థాన యాజమాన్యం రెండేళ్ల వరకూ సేవ చేసే అవకాశం కల్పించదు. శ్రీవారి సేవకు వచ్చే వాలంటీర్లు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.
వివరాలు పంపాల్సిన చిరునామా..!
పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.
మరిన్ని వివరాలకు
0877-2263544,
0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.
T.V.SRIKAR